Simhadri Appanna : సింహాద్రి అప్పన్నకు భారీగా హుండీ ఆదాయం
Simhadri Appanna : సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానానికి 29 రోజుల వ్యవధిలో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. సింహగిరిపై ఉన్న పరకామణి కేంద్రంతో రెండు రోజుల పాటు జరిగిన హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం ముగిసింది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.3,56,22,149 వచ్చినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 142 గ్రాముల బంగారం, 28.440 కిలోల వెండి హుండీల్లో లభ్యమైనట్లు వివరించారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ నెలలో గంధం అమావాస్య, చందనోత్సవం, వైశాఖ పౌర్ణమి వంటి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా 125 కేజీల చందనాన్ని మూడు రోజుల పాటు అరగదీసి స్వామివారికి సమర్పించారు. ఈ వైభవాన్ని చూడటం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో సింహాచలం సింహాద్రి అప్పన్నకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.