Shubman Gill-Avesh Khan : టీ 20 వరల్డ్ కప్ నుంచి ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు ఇంటి బాట పట్టనున్నారు. టీ 20 వరల్డ్ కప్ కు సంబంధించి 15 మందితో కూడిన భారత క్రికెట్ బృందాన్ని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా హర్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. అయితే అమెరికాలో మ్యాచులు ఆడటం.. ఇండియా నుంచి దూరం ఎక్కువగా ఉండటంతో నలుగురు రిజర్వ్ ప్లేయర్లను కూడా సెలెక్ట్ చేసి పంపించారు.
రిజర్వు ప్లేయర్లుగా ఇద్దరు బ్యాటర్లు, ఇద్దరు బౌలర్లను జట్టుతో పాటు అమెరికాకు పంపించారు. శుభమన్ గిల్, రింకూ సింగ్ బ్యాటర్లుగా.. అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లను రిజర్వ్ బౌలర్లుగా సెలెక్ట్ చేసి అమెరికా కు పంపించారు. అయితే భారత్ అమెరికాలో ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్ 8 బెర్త్ కన్ ఫాం చేసుకుంది. కెనడాతో మ్యాచ్ ముగిసిపోతే అమెరికా నుంచి వెస్టిండీస్ కు టీం బయలు దేరుతుంది.
దీంతో బీసీసీఐ నలుగురు రిజర్వ్ ప్లేయర్లు కాకుండా ఇద్దరినే జట్టుతో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుభమన్ గిల్, అవేశ్ ఖాన్ లిద్దరూ టీం వెస్టిండీస్ వెళ్లే సమయంలో ఇండియాకు తిరిగి వచ్చేయనున్నారు. వెస్టిండీస్ లో పిచ్ లు స్లో గా ఉండటం.. స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుండటంతో పేసర్ అవేశ్ ఖాన్ అవసరం లేదని భావించిన బీసీసీఐ అతడిని వెనక్కి పిలుస్తోంది.
ఇప్పటికే యశస్వి జైశ్వాల్ 15 మంది జట్టులో స్సెషలిస్టు బ్యాట్స్ మెన్ గా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. రిజర్వ్ బౌలర్ గా ఖలీల్ అహ్మద్, బ్యాటర్ గా రింకూ సింగ్ అందుబాటులో ఉండనున్నారు. సూపర్ 8 మ్యాచులు ఈనెల 19 నుంచి 25 వరకు వెస్టిండీస్ లోనే జరగనున్నాయి. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచులు కూడా ఇక్కడే జరగనుండటంతో ఇద్దరి ప్లేయర్లు ఇంటి బాట పట్టక తప్పలేదు.