JAISW News Telugu

IPL 2024:కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప‌గ్గాలు మ‌ళ్లీ శ్రేయాస్‌కే!

IPL 2024:ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. స్టార్ క్రికెట‌ర్ల నుంచి రంజీ ప్లేయ‌ర్స్‌ని కూడా భారీ మొత్తం చెల్లించి యాజ‌మాన్యాలు సొంతం చేసుకుంటుండ‌టంతో ఆట‌గాళ్ల‌కు బాగా క‌లిసి వ‌స్తోంది. ఇదిలా ఉంటే వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది మెగా టీ20 టీగ్ ఐపీఎల్‌కు దూర‌మైన శ్రేయాస్ అయ్య‌ర్ తిరిగి జ‌ట్టులో చేరనుండ‌టంతో అత‌డిని కెప్టెన్‌గా నియ‌మిస్తున్న‌ట్లు కేకేఆర్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

నితీష్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని తెలిపింది. గాయం కార‌ణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఎడిష‌న్‌కు శ్రేయాస్ అయ్య‌ర్ దూరం కావడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు. గాయం నుంచి కోలుకునేందుకు అయ్య‌ర్ క‌ష్ట‌ప‌డిన విధానం.. ఆ త‌రువాత అత‌డు ఫామ్‌లోకి వ‌చ్చిన తీరు నిజంగా ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. కెప్టెన్‌గా అత‌డు మ‌ళ్లీ బాధ్య‌త‌లు చేప‌ట్టి త‌మ జ‌ట్టును విజ‌య‌ప‌థంలో నిలుపుతాడ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ మొత్తానికి శ్రేయాస్ అయ్య‌ర్ దూర‌మయ్యారు. అత‌ని స్థానంలో నితీష్ రానాకు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే అత‌డి నాయ‌క‌త్వంలో కేకేఆర్ అనుకున్న విధంగా రాణించ‌లేక‌పోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు వెళ్ల‌డంలో విఫ‌లం చెందింది. సెప్టెంబ‌ర్ – అక్టోబ‌ర్ నెల‌ల్లో జ‌రిగిన ఆసియా క‌ప్‌కు శ్రేయాస్ అయ్య‌ర్ గాయం నుంచి కోలుకుని టీమ్ ఇండియా జ‌ట్టులో స్థానం సంపాదించాడు. అంతే కాకుండా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ నేప‌థ్యంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు బాధ్య‌త‌ల్ని శ్రేయాస్‌కు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Exit mobile version