Pakistan : హైబ్రిడ్ మోడల్ కు పాకిస్తాన్ తలొగ్గక తప్పదా.. లేకుండా ఆశలు వదులుకోవాల్సిందేనా?

Pakistan : ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇచ్చే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు  మొండి వైఖరి అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించడంతో పీసీబీ ఐసీసీ నుంచి సమాధానాలు కోరింది. భారత క్రికెట్ బోర్డు ఏ ప్రాతిపదికన తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాకరించిందో ఐసీసీ సమాధానం చెప్పాలని పీసీబీ కోరుతోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లడం లేదని గత శుక్రవారం పీసీబీతో పాటు ఐసీసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. టీమ్‌ను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి రాలేదని ఐసీసీ పేర్కొంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదని తెలుస్తుంది.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతిపాదించారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, మ్యాచ్‌లు మూడు వేర్వేరు నగరాల్లో నిర్వహించాలి.

అయితే ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. ఇందులో ఏ ప్రాతిపదికన భారత జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు రావడం లేదని ప్రశ్నించింది. ఈసారి హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించే ప్రశ్నే లేదని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఈ మోడల్‌ను ఆసియా కప్ 2023లో అవలంబించారు. దీని తరువాత, పాకిస్తాన్ జట్టు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించింది. బదులుగా 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్తుందని  భావించారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరి కారణంగా నవంబర్ 11న జరగాల్సిన ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వాయిదా పడిన ఈ కార్యక్రమంలో టోర్నీ షెడ్యూల్ కూడా ఖరారు కావాల్సి ఉంది.  ఈ లెక్కన చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను నిరాకరిస్తే దక్షిణాఫ్రికాలో టోర్నీని నిర్వహించవచ్చని భావిస్తున్నారు.

TAGS