Slovakia PM : స్లోవాకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై హత్యాయత్నం జరిగింది. బుధవారం మధ్యాహ్నం హండ్లోవా నగరంలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి వెళ్తూ భవనం బయట ఉన్న అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. ఈ సమయంలో ఓ దుండగుడు పిస్తల్ తో రాబర్ట్ ఫికోపై నాలుగు, ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు.
తీవ్రంగా గాయపడ్డ ఫికోను హెలీకాప్టర్ లో బాన్‌స్క్‌బైరస్టికాలోని హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు ప్రధాని అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. తూటాలు పొట్టలోంచి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో తలకు, ఛాతికి కూడా గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
దాడికి పాల్పడిన దుండగుడిని ప్రధాని బాడీగార్డులతో పాటు అభిమానులు నిర్బంధించారు. ప్రజాస్వామ్యంపైనే దాడిగా అధ్యక్షురాలు జుజానా కపుటోవా అభివర్ణించారు. దుండగుడిగా భావిస్తున్న 71 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అతను ఒక రచయిత అని, ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్త అని రకరకాల వార్తలొస్తున్నాయి. తన లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులకు పాల్పడినట్లు సమాచారం.
దాడి సమయంలో స్లొవాకియా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఘటనపై స్పీకర్ ప్రకటన చేసి సభ వాయిదా వేశారు. మూడు వారాల్లో యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు ఉన్నాయి. ఇందులో ఫికో పార్టీ అతివాద పక్షాల కూటమిదే పైచేయిగా నిలుస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్, పలు దేశాల అధినేతలు ఖండించారు.
రష్యాకు అనుకూలంగా ఉన్నారనేనా?
ఫికో రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ప్రచారం ఉంది. సెప్టెంబర్, 2023లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రష్యా్కు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మూడో సారి ప్రధాని అయ్యారు. ఉక్రెయిన్‌కు సాయం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫికో రాకతో స్లొవాకియా పాశ్చాత్య అనుకూల విధానాలకు తెరపడిందనీ, హంగరీ వంటి యూరప్ దేశాల మాదిరిగా రష్యా అనుకూల వైఖరితో దేశ భద్రత ప్రమాదంలో పడబోతోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
https://www.nytimes.com/video/