AP High Court Shocking Verdict : ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగే వారిపై నిఘా పెట్టాలని ఆదేశించిన అధికారుల తీరును ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు ఆర్టీఐ కమిషనర్ రమణ కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ను మందలించినట్లు సమాచారం. సమాచారం అడిగితే నిఘా పెట్టమని ఆదేశించడం సరికాదంటూ ఏపీ హైకోర్టు అభిప్రాయ పడింది.
సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన వారిపై నిఘా పెట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఆర్టీఐ కమిషనర్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన దరఖాస్తుదారులపై సంఘ విద్రోహ శక్తులని పేర్కొనడంపై ప్రకాశం జిల్లా కి చెందిన జేఏజే అధ్యక్షుడు కే వెంకట్రావ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది పౌరుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని అభిప్రాయ పడ్డారు.
అయితే ఈ పిటిషన్ తరఫున మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ వాదించారు. సమాచార హక్కు ప్రాథమిక హక్కు కిందికి వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే సంఘ విద్రోహ శక్తులంటూ ముద్రవేయడం సరికాదని పేర్కొన్నారు. సమాచార కమిషనర్ల నియామకం రాజకీయ పునరావాస నిలయంగా మారిందని వ్యాఖ్యానించిన హైకోర్టు, అధికారుల తీరును తప్పుబట్టింది. ఇలాంటి వాటిని న్యాయవ్యవస్థ ఊపేక్షించదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నిఘా పెట్టాలని ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆదేశాలిచ్చిన అధికారుల తీరుపై సీరియస్ అయ్యింది. ప్రాథమిక హక్కుకు భంగం కలిగించేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయనే వాదనను హైకోర్టు ఏకీభవించింది.