CM Revanth : తెలంగాణ వరప్రదాయినిగా వెలుగొందుతుందనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆర్థిక భారం, అప్పుల వల్ల నిర్దేశించుకున్న లక్ష్యంలో వచ్చిన ఫలితాలు అంతంత మాత్రమేనని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు తేల్చారు. ప్రాజెక్టుకు మొత్తం రూ.93,872 కోట్లు ఖర్చు అవ్వగా.. ఇందులో రూ.61,665 కోట్లు కార్పొరేషన్ పేరుతో తీసుకున్న అప్పులేనని, మరో రూ.32,207 కోట్లను ప్రభుత్వం బడ్జెట్ నుంచి రిలీజ్ చేసిందని ఇంజినీర్ సుధాకర్ రెడ్డి తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేర్కొన్నారు. ఆయకట్టు విషయంలో కొత్తగా 19.63 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని టార్గెట్ పెట్టుకుంటే ఐదేళ్లలో 98,570 ఎకరాలు మాత్రమే సాధ్యమైందన్నారు.
మూడో టీఎంసీకి విద్యుత్ వినియోగం, భూ సేకరణ అవసరాలకు రూ.33,459 కోట్లు అంచనా వేయగా.. ఇప్పటికే రూ.20, 372 కోట్లు ఖర్చయిందన్నారు. మొత్తంగా కాళేశ్వరం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ ఘటనపై 3 రోజుల పాటు ఫీల్డ్ స్టడీ చేసిన విజిలెన్స్ అధికారులు అనేక కీలకమైన అంశాలను వెల్లడించారు. ప్రాజెక్టు ద్వారా ఏటా 180 టీఎంసీల చొప్పున నీటిని లిఫ్ట్ చేసి అందించాలని టార్గెట్ పెట్టుకోగా ఐదేళ్లలో (2019-20 నుంచి 2023-24వరకు) మొత్తం 900 టీఎంసీలకు గాను కేవలం 162.36 టీఎంసీలనే లిఫ్ట్ చేసినట్లు విజిలెన్స్ డిపార్ట్ మెంట్ రాజీవ్ రతన్ తెలిపారు. ఆశించిన లక్ష్యంలో 18.04శాతం మాత్రమే సాధ్యమైందన్నారు.
నిర్దిష్ట ప్లాన్ కు విరుద్ధంగా బ్లాక్ 7 నిర్మాణం జరిగిందని, దీని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ అయినప్పటికీ జాయింట్ వెంచర్ లో భాగంగా సబ్ కాంట్రాక్ట్ కు వెళ్లిందని రాజీవ్ రతన్ తెలిపారు. బ్యారేజీకి 2019 జూన్ 21న ప్రారంభమైన తర్వాత మెయింటెనెన్స్ చేయలేదన్నారు. నియమాల ప్రకారం ప్రతీ ఏడాది వర్షాకాలం తర్వాత వరదలను దృష్టిలో పెట్టుకుని సౌండింగ్, ప్రోబింగ్ పద్ధతిలో నిర్మాణ పటిష్టతపై స్టడీ జరగాల్సి ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
రెవెన్యూ రికవరీ యాక్ట్..
ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేయడంతో వాటి రికవరీ ప్రభుత్వానికి అవసరమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను చూశాక ఆయన మాట్లాడుతూ.. అవినీతి సొమ్మును రాబట్టడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించకతప్పదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ తీవ్రతను దగ్గర నుంచి చూశామని, దాన్ని రిపేర్ చేసి సరిపెట్టడమా? లేక మొత్తం బ్లాకును తొలగించి కొత్తదాన్ని కట్టడమా? అనే దానిపై నిపుణుల కమిటీతో చర్చించాక నిర్ణయం తీసకుంటామన్నారు.
జ్యూడీషియల్ విచారణ..
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ ఇబ్బందులు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు విజిలెన్స్ అధికారులు గుర్తించినందున నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాటిపై క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుందని రేవంత్ వివరించారు. సిట్టింగ్ జడ్జితో జ్యూడీషియల్ విచారణకు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశామని, రిటైర్డ్ జడ్జి విచారణకు ఆఫర్ ఇచ్చిందన్నారు. సీబీఐ కంటే ఉన్నతమైన విచారణ అనే ఉద్దేశంతోనే ఈ దిశగా ఆలోచించామన్నారు.