Janasena : విశాఖపట్నంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి రాజకీయ చేరికల కార్యక్రమం తనకు ఇష్టమైన వైజాగ్ తో మొదలైందని అన్నారు. వైసీపీ తనకు శత్రువు కాదని, జనసేన మీ అందరికీ బలాన్ని ఇచ్చి స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.