Peddireddy : పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఈ నెల 13న ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓ వైపు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచార హోరు చూపిస్తున్నాయి. మరో వైపు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేట్ల పర్వం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల సమయంలో ఇప్పటికే డీజీపీ సహా 10 మంది ఐపీఎస్ అధికారులపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది. తాజాగా మరో ఇద్దరు అధికారుల్ని విధుల నుంచి తప్పించింది. అదీ రాయలసీమలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో కావడం మరో విశేషం. ఇప్పటివరకూ రాయలసీమలో పోలీసు అధికారులపై ఫిర్యాదులతో వరుస బదిలీలు చేస్తున్న ఈసీ.. ఇదే క్రమంలో ఈ రెండు బదిలీలు కూడా చేసింది.
అధికార పార్టీ వైసీపీకి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఈసీ మంగళవారం వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసిన మరుసటి రోజే ఈ ఉత్తర్వులు వెలువడటం ఈ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాల్సిన డీఎస్పీ, ఎస్సైలు పెద్దిరెడ్డికి తొత్తులుగా మారి.. విపక్షాలను నానా ఇబ్బందులకు గురిచేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వీరు యథావిధిగా స్వామిభక్తి ప్రదర్శించారు. వీరి వ్యవహారం రానురాను శృతి మించడంతో మించడంతో ఈసీ వారిపై కొరడా ఝళిపించింది. వెంటనే డీఎస్పీ, ఎస్సైను బదిలీ చేసి, ఆయా స్థానాల్లో వేరేవారిని నియమించాలని ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు ఆదేశాలు అందాయి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి పై పోటీ చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ పై దాడి జరిగింది. ఇందులో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆయన అనుచరులకూ దెబ్బలు తగిలాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ.. ఈ రెండు బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్త హేమాద్రిని వైసీపీ నాయకుడు నాగభూషణం అనుచరులు కిడ్నాప్ చేసినా, పోలీసులు బాధ్యులపై కఠినంగా వ్యవహరించలేదు. ఇవాళ చేసిన బదిలీల నేపథ్యంలో రాయలసీమలో పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లోపు మరిన్ని బదిలీలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అధికారులు నియమావళి ప్రకారం విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.