Manjummel Boys : ‘మంజుమ్మెల్ బాయ్స్’కు షాక్.. ఖాతాలను స్తంభింపజేసిన ఈడీ?
Manjummel Boys : యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. రిలీజ్ ఫస్ట్ షో నుంచే బాక్సాఫీస్ టాక్ తో దూసుకుపోయింది. అత్యంత భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ మళయాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమా ప్రస్తుతం వివాదంలో చిక్కుతుంది.
మంజుమ్మెల్ బాయ్స్ సినిమా యూనిట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. తాను ఈ సినిమా నిర్మాణానికి రూ. 7 కోట్ల పెట్టుబడులు పెట్టానని లాభాల్లో 40 శాతం వాటా ఇస్తానని మేకర్స్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు తనకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని సిరాజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
సిరాజ్ ఫిర్యాదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర్టు ఆదేశించింది. నిర్మాతలు శోభన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించి అందులో నటించిన షౌబిన్ ను ఇటీవల ఈడీ విచారించింది.
విచారణ నేపథ్యంలో మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని ఈడీ కోరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ నిర్మాణం, పంపిణీకి సంబంధించి మనీలాండరింగ్ కేసు ఉండి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్ తో సంబంధం ఉన్న వారి బ్యాంకు ఖాతాలను ఈడీ నిజంగా స్తంభింపజేసి అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం ఇటీవలి కాలంలో మలయాళం నుంచి వచ్చిన ఇతర బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లు కూడా దీని కిందికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంజుమ్మెల్ బాయ్స్ రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.