Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ రెజ్లర్, ఫైనల్ కు చేరిన వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. మహిళల 50 కేజీల సెమీ ఫైనల్ లో వినేష్ 5-0తో క్యూబాకు చెందిన ఉస్నేలిస్ గుజ్ మన్ లోపెజ్ పై విజయం సాధించింది. ఈ రోజు రాత్రి ఫైనల్ లో వినేష్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి.
వినేష్ ఫొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు ఐవోఏ సిద్ధమైంది. ఒలింపిక్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే, మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫొగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపైనా ఐవోఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐవోఏ డిమాండ్ చేసినట్లు సమాచారం.