Harthik Pandya : భారత క్రికెట్ కు మంచి మంచి విజయాలు సాధించిన కేప్టెన్ రోహిత్ శర్మ తర్వాత కేప్టెన్ ఎవరైతే బాగుంటుందని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికైతే టీ20కి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. వెంటనే మరో కేప్టెన్ ను అవసరం. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ స్థానానికి హార్థిక్ పాండ్యా పేరు వినిపించింది. ఈయనతో పాటు యంగ్ ప్లేయర్స్ శుభమన్ గిల్, రిషబ్ పంత్ పేర్లు కూడా వినిపించాయి.
అయితే, గంభీర్ సూచనతో టీ20 కేప్టెన్ రేసులోకి మరో పేరు చేరింది. అతనే 360 డిగ్రీ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. భారత్ టీ20 కేప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైనట్లు క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. టీ20 జట్టుకు హార్థిక్ పాండ్యా కేప్టెన్‌గా అన్న వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌కు కేప్టెన్ బాధ్యతలు అప్పగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించిందని క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. దీని ప్రకారం.. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కేప్టెన్ గా కనిపించనున్నాడని సమాచారం.
సూర్య గతంలో 7 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. కీలక ఆటగాళ్ల గైర్హాజరీ మధ్య జట్టుకు సారథ్యం వహించి ఆదుకున్నాడు. మొత్తం 7 మ్యాచ్ లో ఐదింటిలో విజయం కట్టబెట్టాడు. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ తో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
టీ20 జట్టుకు బీసీసీఐ కొత్త కేప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన సమయం వచ్చింది. దీని ప్రకారం రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా పేర్లు రేసులో ఉన్నాయి. అయితే ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను వెనక్కి నెట్టి కెప్టెన్సీని అందుకోవడంలో సూర్యకుమార్ సక్సెస్ అయ్యాడని క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. దీంతో రోహిత్ శర్మ వారసుడిగా సూర్యకుమార్ కనిపించబోతున్నట్లు తెలిపింది.
దీనికి ముందు హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. ఫిట్‌నెస్ కారణంగా ప్రతి సిరీస్‌లో హార్థిక్ అందుబాటులో ఉండడం అనిశ్చితంగా ఉంది. అందుకే శాశ్వతంగా ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ సూచించారు. ఆయన సూచనలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ సూర్యకుమార్ కు సారథి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.