Krishavamsi : తెలుగులో పరిచయం అక్కరలేని దర్శకుడు కృష్ణవంశీ. ఇండస్ట్రీలో ఆయన చేసిన ప్రతి సినిమా ఒక అద్భుతం. గులాబీ, సింధూరం, అంతఃపురం సినిమాలు చాలు ఆయన సత్తా ఏంటో నిరూపించడానికి. చక్కని ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో దిట్ట. పల్లెటూరి వాతావరణాన్ని తన సినిమాల్లో అందంగా బంధించగల ఉత్తమ టెక్నీషియన్. కుటుంబ బంధాలు, ప్రేమ వంటి అంశాలను చాలా చక్కగా తెరమీద చూపిస్తుంటారు. తన చిత్రాలతో హీరోలకు కొత్త ఇమేజ్ ని తీసుకువస్తారు. నాగార్జునకి నిన్నే పెళ్లాడతా, మహేష్ బాబుకి మురారి సినిమాలే ఇందుకు ఉదాహరణలు. అప్పటి వరకు మూస ధోరణిలో పయనిస్తున్న నాగార్జున, మహేష్ బాబును కొత్త పంథాలో నడిపించిన ఘనత ఆయనదే.
ఇక దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తితో కృష్ణవంశీకి ఉన్నంత అనుబంధం, సాన్నిహిత్యం మరే దర్శకుడితో అంతగా లేదనే చెప్పాలి. తన సినిమాల్లో కనీసం ఒక్క పాటయినా సీతారామశాస్ర్తితో రాయిస్తారంటే మధ్య బాండింగ్ ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఓ ప్రోగ్రామ్ లో సీతారామశాస్ర్తి తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
సిరివెన్నెల శాస్త్రి తో తనకు 1989 నుంచి పరిచయం ఉందని.. ఆయన దొరకడం మహా అదృష్టమని చెప్పుకున్నారు. ఏ అర్హత లేకపోయినా ఆయన తనను కొడుకుగా స్వీకరించారని.. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్లమని చెప్పారు. ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. ఆయన ఉన్నప్పుడు తన సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయి, ఇది కథ అని ఆయన చెప్పేవాడినన్నారు. ఆయన లేకపోవడంతో తానొక అనాథను అయిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రతి సినిమాలో తాను ఇచ్చే పాట గురించి వివరించేవాడన్నారు. శ్రీ ఆంజనేయం సినిమాలో రామరామరఘురామ పాట సందర్భంగా ఆంజనేయ తత్వం అంటే ఏమిటో ఆయన చెప్పాడన్నారు. కొన్ని పాటలు రాసే సందర్భంలో సీతారామశాస్ర్తి కొన్ని మార్పులు చెప్పేవారని వాటిని వెంటనే మార్చేసేవాడినని గుర్తు చేసుకున్నారు.