Sharmila Vs Jagan : జగన్ కు షర్మిల సవాల్.. ఉత్కంఠ రేపుతున్న కడప ఎంపీ స్థానం
Sharmila Vs Jagan : ఏపీలో సమ్మర్ హీట్ తో పాటు పొలిటికల్ హీట్ కాక రేపుతోంది. వైసీపీ, టీడీపీ కూటమిలు అభ్యర్థుల ప్రకటన పూర్తి చేశాయి. ప్రచార బరిలోకి సైతం దిగాయి. ఈతరుణంలోనే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మహా కూటమిగా బరిలో దిగనుంది. దీంతో ఏపీలో త్రిముఖ పోటీ తప్పదని తేలిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు గానూ, 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టింది. మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి పేర్లను ప్రకటించారు. జాతీయ స్థాయిలో వామపక్షాలు ఇండియా కూటమిలో కొనసాగుతున్నాయి. ఏపీలో సైతం వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. చిన్నచితకా పార్టీలు సైతం కాంగ్రెస్ తో జత కలిసే అవకాశం ఉంది. అందుకే ఆ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనుండడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డిని ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి పోటీ చేయనున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. జగన్ ను రాజకీయంగా ఢీకొడుతున్న షర్మిల అందుకు తగ్గట్టుగానే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కడప అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డా. అటువంటి చోట వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బరిలో దిగుతుండడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో వైఎస్ కుటుంబ సభ్యుల్లో కూడా చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. అటు వైఎస్ అభిమానుల్లోనూ ఒక రకమైన గందరగోళం నెలకొంది. వారు ఎటువైపు మొగ్గు చూపుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
గత కొద్దిరోజులుగా వైఎస్ కుటుంబంలో రాజకీయ విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోదరుడు జగన్ ను షర్మిల విభేదిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరి పీసీసీ పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచి జగన్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మరో వైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో అవినాశ్ పాత్రను, నిందితులను జగన్ వెనుకేసుకొస్తున్నారని షర్మిల ఆరోపణలు చేశారు.
ఈ తరుణంలో ఇప్పుడు షర్మిల నేరుగా రంగంలోకి దిగడం విశేషం. అయితే ఇక్కడ షర్మిల వైసీపీ ఓట్లను చీల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే టీడీపీ అభ్యర్థికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి బదులు తనకు టికెట్ కావాలని ఆదినారాయణరెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ కు షర్మిల గట్టి సవాల్ విసురుతున్నారు. అన్నాచెల్లెళ్ల పోరులో ఎవరు నెగ్గుతారో అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.