Sharmila with Babu : ఏపీలో ఎటూ చూసినా ఎన్నికల రాజకీయమే నడుస్తోంది. ఏ నేత ఎవరితో కలిసినా ఏదో జరుగుతుందోనని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసే పనిలో పడింది. మూడు జాబితాలు విడుదల చేసింది. ఇక టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. జగన్ తన అభ్యర్థులను మొత్తం ప్రకటించిన తర్వాత.. వారిని దీటుగా ఎదుర్కొనే బలమైన అభ్యర్థులను బరిలో దింపేలా ఆలోచన చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ధన, అంగ బలాలతో పాటు ప్రజల్లో మంచి పేరున్న అభ్యర్థులను తమ కూటమి ద్వారా బరిలో దించాలని చంద్రబాబు-పవన్ భావిస్తున్నారు. ఇక తమ కూటమిలోకి బీజేపీ, కాంగ్రెస్ ల్లో ఎవరో ఒకరిని చేర్చుకునేలా వ్యూహాలు పన్నుతున్నారు.
అయితే ఈ విషయంపై బీజేపీ ఇప్పటిదాక తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇక కాంగ్రెస్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటుందో క్లారిటీ లేదు. ఇప్పుడంతా పండుగ సీజనే కాబట్టి మరో వారంలో ఏదో నిర్ణయమైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలపై రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చర్చ జరుగుతుండగానే కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఆ పార్టీ వైపు చాలా మందే చూస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మరింత మంది కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక తన వ్యూహాలను మరింత పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణలో అధికారం తర్వాత ఏపీలో ఆ పార్టీకి కాస్త పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సీనియర్ నేతలు కూడా యాక్టివ్ మోడ్ లోకి వస్తున్నారు.
ఈనేపథ్యంలో హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి తమ కుమారుడి వివాహానికి రావాలని వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వీరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరు ఏం చర్చించి ఉంటారనేదానిపై ఊహగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తో పొత్తు వల్ల చంద్రబాబు-పవన్ కూటమికి లాభాలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జగన్ స్వయానా చెల్లెలు తమ కూటమిలో భాగమైతే అతన్ని నైతికంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే వైఎస్ అభిమానుల్లో కొందరినైనా తమ కూటమి వైపునకు తిప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరు ఎవరికి తోచిన ఆలోచనలు వారు చేస్తున్నారు.
కాగా, షర్మిల కీలకనేతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి కూడా పెద్ద అభ్యంతరాలేవి ఉండకపోవచ్చు. జీరో స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కూటమితో జట్టు కట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే సంక్రాంతి తర్వాత పార్టీల పొత్తుల వ్యవహారాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.