Sharmila Campaign : ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఈ రోజు బాధ్యతలు తీసుకుంది. విజయవాడలో భారీ కాన్వాయ్ తో పార్టీ కార్యాలయంకు వెళ్లిన ఆమె బాధ్యతలు తీసుకుంది. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. షర్మిల బాధ్యతలు తీసుకునేందుకు వెళ్తుండగా కార్యకర్తల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. తాను ముందుగానే అనుమతి తీసుకున్నా ఈ అడ్డగింపులు ఏంటని ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం భయపడుతున్నట్లుగా భావిస్తున్నా అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదన్న షర్మిల రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అప్పటి వరకు ఓపికతో ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం అరాచకాలను ఒక్కొక్కటిగా బయట పెడతానని. ఇక తనను ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. తనవైపే కాదు.. తన కార్యకర్తలపై దాడులు చేస్తామని చూసినా సహించేది లేదన్నారు.
ఏపీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి నేరుగా జనంలోకి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారంను ప్రారంభించనున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు షర్మిల పర్యటనపై సమాచారం కూడా పంపించారు. వారు కూడా పార్టీ ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాగతం నుంచి వీడ్కోలు వరకు ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ శ్రేణులకు ఇప్పటికే వివరించారు.