Sharmila : ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై, ఘోర పరాజయన్ని మూటగట్టుకొని ప్రజలకు మొహం చూపించలేకపోతున్న జగన్మోహన్ రెడ్డికి మరో కొత్త సమస్య వచ్చింది. అది కూడా చెల్లి వైఎస్ షర్మిల నుంచే! ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ కు ఒక్క సీటు తేలేకపోయినా.. తనకు అన్యాయం చేసిన అన్నను మాత్రం గద్దె దించడంలో కీలకంగా వ్యవహరించింది. అక్కడితో కథ ముగిసిపోలేదని అంటుంది షర్మిల. వైసీపీ పూర్తి అంతం తన చేతుల్లోనే అని శపథం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తండ్రి మరణంతో జగన్ ‘ఓదార్పు యాత్ర’ చేసి ప్రజలకు దగ్గరయ్యారు. తండ్రి పేరు చెప్పే బలమైన నేతలు, కేడర్ ను వైసీపీకి వైపునకు మళ్లించాడు. అధికారంలోకి వచ్చే వరకు తండ్రి పేరును జగన్ నిత్యం స్మరణ చేశారు. చివరికి అదే ఆయనను అధికారంలోకి తెచ్చింది.
జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయారు కనుక మళ్లీ తండ్రి పేరుతో జనంలోకి వెళ్లకమానరు. ఈ విషయాన్ని అందరికంటే ముందే షర్మిల గ్రహించారు. అందుకే ఆమె చకచకా పావులు కదిపి జూలై 8న విజయవాడలో అట్టహాసంగా వైఎస్ 75వ జయంతి నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
నిజంగా తండ్రిపై ఆమెకు అభిమానం ఉంటే చాటింపు వేసుకోనవసరం లేదు. కాయలు అమ్ముకోవాలంటే చెట్టు పేరు చెప్పక తప్పదన్నట్లు, ఏపీలో కాంగ్రెస్ ను బతికించుకోవాలంటే ‘వైఎస్ ఇమేజ్’ అవసరం.
కనుక వైఎస్ ఇమేజ్ కాంగ్రెస్ కు మాత్రమే సొంతం అని నిరూపించేందుకు హడావుడి చేస్తున్నట్లు భావించవచ్చు. అందుకే ఇంతకాలం ‘వైఎస్’ను పట్టించుకోని కాంగ్రెస్ ఆమె ప్రయత్నాలకు మద్దతిస్తోందని భావించవచ్చు. జగన్ కూడా తండ్రి పేరుతోనే రాజకీయాలు చేసి పైకచ్చారు కనుక చెల్లి హడావుడి దేనికో బాగా తెలుసు. ఇది జగన్ కు మరో కొత్త తలనొప్పే అని చెప్పక తప్పదు.
కనుక జగన్ కూడా చనిపోయిన తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నించక తప్పదు. జగన్ కూడా వైఎస్ జయంతి పోటీలలో పాల్గొనక తప్పదు. కనుక వైసీపి కూడా జూలై 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
అన్న విజయవంతంగా అమలు చేసిన ఫార్ములాని షర్మిల అన్నపైనే ప్రయోగించి వైసీపిని కాంగ్రెస్‌లో కలిపేసుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. కనుక చెల్లి నుంచి వైసీపిని కాపాడుకోవడానికి జగన్ కూడా ప్రయత్నాలు చేయక తప్పదు.