YS Sharmila : ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం పలువురు ప్రముఖుల ఇండ్లతో పాటు వ్యాపార కార్యకలాపాలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ హోటల్ సంస్థ ‘చట్నీస్’ కు బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని చట్నీస్ హోటల్ పై ఐటీ అధికారులు సోదాలు చేశారు. హోటల్ యజమాని అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
అట్లూరి పద్మ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు స్వయానా వియ్యంకురాలనే విషయం తెలిసిందే. అట్లూరి పద్మ కూతురినే షర్మిల కొడుకు రాజారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. హైదరాబాద్ చట్నీస్ హోటల్ కు ఓ బ్రాండ్ ఉంది. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఎన్నో బ్రాంచిలు ఉన్నాయి. పదేళ్లుగా చట్నీస్ పేరుతో అట్లూరి పద్మ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
మంగళవారం ఊహించని విధంగా చట్నీస్ హోటల్స్ పై ఐటీ అధికారులు దాడులు చేయడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ, ఐటీ అధికారులు నుంచి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఐటీ దాడుల వెనక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఏపీలో షర్మిల కాంగ్రెస్ బాధ్యురాలిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్న జగన్ ఓటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అలాగే బీజేపీ కేంద్ర నాయకత్వంపై కూడా ఆమె విరుచుకుపడుతున్నారు. అందరూ కలిసి మరుగున పడేసిన ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు.
ఈక్రమంలో షర్మిల వియ్యంకురాలు పద్మపై ఐటీ దాడులు జరుగడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు సిటీలోని మేఘనా ఫుడ్స్ అండ్ ఈటరీస్ లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ తో పాటు బెంగళూరులోనూ మేఘనా ఫుడ్స్ కు ఫ్రాంచైజీలు ఉన్నాయి. చట్నీస్, మేఘనా ఫుడ్స్ లలో జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.