YS Sharmila : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు కూడా సాధించలేకపోయింది. అయితే ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలకు అన్యాయం చేశారని.. ఎన్నికల్లో తనకు నచ్చిన వారికి పార్టీ ఫండ్ ఇచ్చిందన్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ దాచుకుందని అభ్యర్థులకు ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని పద్మశ్రీ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశామన్నారు. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు.
పద్మశ్రీ చేసిన ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు కానీ.. దీని వెనుక రాజకీయం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తు్న్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుంది. ఏపీ వంటి రాష్ట్రాలకు పార్టీ ఫండ్ పంపించే పరిస్థితి లేదు. కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలు ఉన్నా.. అవి సాయం చేయాలనుకుంటే.. గెలుపు అవకాశాలు ఉన్న ఇతర రాష్ట్రాల్లో పార్టీ శాఖలకు కేటాయిస్తారు. గెలిచే ఛాన్సే లేని ఏపీ కాంగ్రెస్ ఇచ్చే అవకాశమే లేదు.
షర్మిల రాష్ట్రంలో పూర్తిగా చచ్చిపోయిన పార్టీకి ఊపిరి పోసే ప్రయత్నం చేశారు. ఆమె సారథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కొంత ఓటు బ్యాంక్‌ను మళ్లీ తెప్పించుకోగలిగింది. రెండు, మూడు స్థానాల్లో గెలుస్తారని వివిధ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడించాయి. అయినా చివరిలో ఏ అభ్యర్థి గెలుపు చాయల వరకూ రాలేదు. కానీ కడప జిల్లాతో పాటు కొన్నిచోట్ల వైసీపీ అభ్యర్థుల పరాజయానికి కారణం అయ్యారు. వైసీపీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ ఎంత బలహీనపపడితే కాంగ్రెస్‌కు అంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ ఓ కూటమిగా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా జనాలంతా కాంగ్రెస్ వైపే చూస్తారు. అందుకే కాంగ్రెస్ ను మరింత ఎదగకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే షర్మిలను టార్గెట్ చేశారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. షర్మిలకు పార్టీఫండ్ ఇచ్చామో లేదో హైకమాండ్ కు తెలుసు కాబట్టి ఆమెపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్రలు దాగున్నాయని.. అందుకే షర్మిలకు మరింత మద్దతు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.