V Hanumantha Rao : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ముందే వచ్చి ఉండాల్సింది: వీహెచ్

V Hanumantha Rao

V Hanumantha Rao

V Hanumantha Rao : ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఇంకా ముందుగానే వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఆలస్యంగా వచ్చినా వైసీపీ ప్రభుత్వంపై ఆమె బాగా పోరాటం చేశారని ప్రశంసించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం నమూనా పరిశీలించేందుకు గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన పట్టణంలోని రాజీవ్ గాంధీ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల తన అన్న కోసం రాష్ట్రమంతటా పర్యటించారని వీహెచ్ గుర్తు చేశారు. తర్వాత ఆమెకు రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఏపీ రాజకీయాల గురించి తాను మాట్లాడడం సరైంది కాదని, అయితే ఏపీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలుసని అన్నారు.

దేశంలో పదేళ్లు అధికారంలో ఉన్న పీఎం మోదీ ఏం అభివృద్ధి చేశారని వీహెచ్ ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగిందన్నారు. ఏ ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదన్నారు. ఇండియా కూటమి క్యాన్సర్ వంటిదని, పాకిస్తాన్ మద్దతుదారులంటూ మోదీ విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. మోదీ, అమిత్ షాలు మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

TAGS