YS Sharmila : కంటతడి పెట్టిన షర్మిల.. వైరల్ అవుతున్న వీడియో

YS Sharmila

YS Sharmila

YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టే తాను ఏపీలో అడుగుపెట్టానని అన్నారు. పదవుల కోసం రాజకీయాలు చేసేదాన్ని అయితే 2019లోనే పదవులు పొంది ఉండేదాన్నన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టే విడిపోయి పదేళ్లయినా వెనకబడే ఉందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు..

ప్రత్యేక హోదా విషయంలో జగన్, చంద్రబాబులకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన చెందారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, విభజన హామీలు అమలుచేయకుండా బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు.

ప్రత్యేక హోదా కాంగ్రెస్ కు ఎన్నికల అంశం కానేకాదని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరని దాని సాధించేందుకు అంతా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాజధాని, పోలవరం నిర్మించుకోవచ్చని సూచించారు. హోదా కోసం పోరాడకపోతే ఎప్పటికీ రాదని హెచ్చరించారు. రాష్ట్రానికి హోదా సాధించలేని వాడు రాజశేఖర్ రెడ్డి వారసుడు ఎలా అవుతాడంటూ జగన్ పై మండిపడ్డారు. షర్మిల కంటతడి పెట్టిన సమయంలో బీజేపీ, వైసీపీ డౌన్.. డౌన్ అంటూ కార్యకర్తలు నినదించారు. షర్మిల కంటతడి పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

TAGS