Sharmila : అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు రేటు ఫిక్స్..దేని ధర దానిదే అంటున్న షర్మిల
Sharmila : రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఏప్రిల్ లో మొదటి విడతలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల అధినేతలు అభ్యర్థుల ప్రకటనలు, పొత్తుల వ్యవహారాలు, ప్రచార యాత్రలకు రెడీ అవుతున్నారు.
వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకోవడానికి వైసీపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈక్రమంలో సీఎం జగన్ శనివారం నుంచి జనంలోకి వెళ్లనున్నారు. ‘సిద్ధం’ పేరుతో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. తొలి సభ విశాఖ జిల్లా భీమిలిలో ఏర్పాటు చేస్తున్నారు.
కాంగ్రెస్ కూడా తన రాజకీయ కార్యాచరణను వేగవంతం చేసింది. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో పూర్వవైభవాన్ని సొంతం చేసుకుంటామని హైకమాండ్ నమ్ముతోంది. స్టేట్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. హైకమాండ్ పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ఎన్నికల ప్రచార కార్యక్రమాల వరకూ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఆమెకు అప్పగించింది.
దీంతో షర్మిల తన అన్న జగన్ తో పాటు బీజేపీ, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అన్న జగన్ పై కుటుంబ విభేదాల నుంచి పాలన వైఫల్యాల వరకు అన్ని ఏకరువు పెట్టి మరీ ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీ మీడియాలో ఆమె బాగా ఫోకస్ అవుతున్నారు. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ పెద్దలంతా దిగివస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు.. కాంగ్రెస్ పార్టీకి విరాళాన్ని చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన తెరపైకి తెచ్చారు. ‘డొనేట్ ఫర్ దేశ్’ పేరుతో ఇదివరకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈమేరకు విరాళాలను సేకరిస్తోంది.
ఇందులో భాగంగా ఏపీలో కాంగ్రెస్ బీ-ఫారం తీసుకోదలిచిన అభ్యర్థులు అసెంబ్లీ- రూ.10,000, లోక్ సభ కు 25,000 రూపాయలను విరాళంగా చెల్లించాల్సి ఉంటుందని షర్మిల వెల్లడించారు. ఈ మొత్తం రూపాయలు పార్టీ అకౌంట్ లో జమవుతాయని చెప్పారు.