Sharmila meet Jagan : ఏపీ రాజకీయాల్లో ఇటీవల ప్రధానంగా కాంగ్రెస్ లో షర్మిల చేరికపైనే అంతటా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైందని జనవరి 4న ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆమె కూడా క్లారిటీ ఇచ్చారు. దాదాపు చేరినట్టే అని చెప్పవచ్చు.
తెలంగాణ ఏర్పాటు, జగన్ పార్టీతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపెట్టుకపోయింది. అక్కడక్కడా నాయకులు తప్పా పెద్దగా క్యాడర్ లేదు. అందరూ జగన్ పార్టీలోకే వెళ్లిపోయారు. ప్రజల్లో ఊపు తెచ్చే నాయకుడు లేడు..కనీసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందని చెప్పడానికి కూడా లేకపోయింది. అలాంటి పార్టీలోకి వైఎస్ఆర్ బిడ్డ షర్మిల చేరుతుండడంతో ఆ పార్టీకి మైలేజీ రావడం ఖాయం.
వైఎస్ షర్మిల రాజకీయాలపైగాని, ఇతర విషయాలపై గాని వైఎస్ జగన్ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కరే రాజకీయం చేయాలని, అది తాను ఎలాగూ చేస్తున్నాను కాబట్టి షర్మిలకు ఎందుకు రాజకీయాలు అన్న భావన మాత్రం లోపల ఉండిఉంటుంది. కానీ ఆయన ఏ రోజు ఆ విషయాలను బయటపెట్టలేదు. అలాగే ఆమెతో సయోధ్యకు ప్రయత్నిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిని తాజాగా వైవీ సుబ్బారెడ్డి తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము ఎవరినీ సంప్రదించమని చెప్పారు. తమ జగన్ చేపట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని అన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల తన అన్న జగన్ ను తాడేపల్లి నివాసంలో కలువనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించేందుకు వెళ్లనున్నారు. ఆమె వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి కూడా ఉంటారని తెలుస్తోంది. షర్మిల ఆయన్ను గత మూడు, నాలుగు ఏండ్లుగా కలుసుకోలేదు. ఇద్దరి మధ్య ఆస్తి, రాజకీయ వివాదాలు ఉన్నాయని టాక్ ఉంది. అందుకే షర్మిల ఏపీని వదులుకుని తెలంగాణలో పార్టీ పెట్టినట్టు చెబుతున్నారు. అయినా అక్కడ అంతగా ఆదరణ రాకపోవడంతో ఇక కాంగ్రెస్ ద్వారా ఏపీలోకి అడుగుపెడుతోంది. ఈవిషయంపై జగన్ ఇంతవరకు స్పందించలేదు. మరి ఈ భేటీలో అవేమైనా చర్చకు వస్తాయా? కులాసా ప్రశ్నలే ఉంటాయా అనేది చెప్పలేం. మొత్తానికైతే అన్నా, చెల్లి చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నారు.