Sharmila No Longer In Telangana politics : తెలంగాణ రాజకీయాల్లోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల ఎంట్రీ ఇచ్చింది. తన అన్న ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా, ఇక్కడే ఉంటానని రాజకీయాలు చేయబోయింది. తెలంగాణ సీఎంను టార్గెట్ చేసి ఎన్నో విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టింది. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎన్నో పోస్టులు పెట్టింది. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీలోనే లేకుండా పోయింది. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ ఆమెకు హ్యాండివ్వడంతో ఆమె ఇక పోటీ నుంచి తప్పుకుంది.
తెలంగాణలో వైఎస్సార్టీపీ ని ప్రారంభించి, కొంతకాలం అధినేత షర్మిల హడావిడి చేసింది. అయితే కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లోకి వెళ్లాలని విశ్వప్రయత్నాలు చేసింది. కన్నడ నేతలను నమ్ముకొని అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ దీనికి తెలంగాణలో కీలక నేతలు సమ్మతించలేదు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన షర్మిల అక్కడే రాజకీయాలు చేసుకోవాలని, తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే పార్టీ మునిగిపోతుందని అధిష్టానానికి నచ్చజెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే నష్టం లేదని, కానీ తెలంగాణ రాజకీయాల్లో ఆమె పాత్ర అవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఇక కాంగ్రెస్ హ్యాండివ్వడంతో స్వతహాగా బరిలోకి దిగుతానని షర్మిల ప్రకటించింది. కానీ నామినేషన్ల పర్వం మొదలయ్యాక, పోటీలో ఉండబోవడం లేదని, కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాంగ్రెస్ మద్దతునిస్తున్నట్లు చెప్పింది. ఇక ఆమెను నమ్ముకున్న నేతలు షర్మిలను తిట్టిపోశారు. ఇన్నాళ్లు ఆమెను నమ్ముకొని ఎంతో చేశామని, ఇప్పుడు ఎన్నికల్లో లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో పలువురు గులాబీ గూటికి చేరిపోయారు కూడా. ఇక తెలంగాణలో వైఎస్ అభిమానులు కూడా షర్మిలను నమ్ముకొని మోసపోయామని నేరుగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఇక తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పాత్ర ముగిసినట్లేనని, ఇక ఆమె రానున్న ఏపీ ఎన్నికలపై దృష్టి పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రజలు కష్టాల్లో ఉన్నారని, అక్కడే తన అన్నతో తేల్చుకుంటే కొంత సానుభూతి అయినా వస్తుందని అంటున్నారు. మరి షర్మిల నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.