YS Sharmila : ఏపీలోని సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మైదుకూరు నియోజకవర్గంలో ఆమె మాట్లాడుతుండగా.. ఓ జగన్ అభిమాని ఆమెను అడ్డుకున్నాడు. జగన్ తమకు అన్నీ ఇచ్చాడంటూ ఆమెకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె స్వయంగా అతన్ని ఆహ్వానించి ఏమిచ్చాడో చెప్పమంటూ మైక్ ఇచ్చారు. అనంతరం అతడు వెఎస్ జగన్ పాదయాత్ర చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడని చెప్పుకొచ్చాడు.
మైదుకూరు నియోజకవర్గంలో వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగా.. దువ్వూరు మండల కేంద్రంలో వైఎస్ షర్మిల మాట్లాడుండగా జై జగన్ అంటూ ఓ కార్యకర్త నినాదాలు చేశాడు. దీంతో జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని షర్మిల అతడికి సవాల్ విసిరారు. అనంతరం సదరు కార్యకర్తను పిలిచి మాట్లాడించారు. జగన్ తమకు అన్నీ చేశాడంటూ అతను చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత షర్మిల మాట్లాడుతూ అతడికి సూటి ప్రశ్నలు వేశారు. జగన్ చేసిన అభివృద్ధి ఏమి లేదంటూ షర్మిలకు కాంగ్రెస్ అభిమానులు నినాదాలు చేశారు.
ఒకప్పుడు తాను కూడా జై జగన్ అన్న వ్యక్తినే అని షర్మిల గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతారు అనుకున్నానని, రాష్ట్ర అభివృద్ధిపై మాట తప్పుతాడు అనుకొలేదని చెప్పారు. మద్యపాన నిషేధం అమలైందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తాం అన్నాడు..పోరాటం చేశాడా? అని అడిగారు. పోలవరం కడతాం అన్నాడు.. కట్టాడా? అని అడిగారు. రాష్ట్రానికి కనీసం రాజధాని ఉందా? అని నిలదీశారు.
మాట ఇస్తే మాట మీద నిలబడడం వైఎస్ఆర్ లక్షణమని, మరి మాట తప్పిన జగన్ ను ఏమనాలి? అని ప్రశ్నించారు. జగన్ జైల్లో ఉంటే 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నేను అని అతడికి గుర్తు చేశారు.