Sharmila : అన్నీ పార్టీలను ఏకీపారేసిన షర్మిల.. ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే ఘాటు వ్యాఖ్యలు..
Sharmila : కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఆహ్వానం కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల ఏం మాట్లాడబోతున్నారు.. అన్న జగన్ పాలనపై ఏ విధంగా స్పందించబోతున్నారని కొంతకాలంగా అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే షర్మిల తనదైన శైలిలో దూకుడుగా పదునెక్కిన మాటలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు.
ఇంతకీ షర్మిల ఏం మాట్లాడిందంటే.. వైసీపీ, టీడీపీ దొందు దొందేనని, గత పదేళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు లక్ష కోట్లు అని, చంద్రబాబు రూ.2లక్షల కోట్లు, ప్రస్తుత సీఎం జగన్ రూ.3లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. కార్పొరేషన్ రుణాలు, ఇతర బకాయిలు అన్నీ కలిపితే రూ.10లక్షల కోట్ల భారం రాష్ట్రంపై ఉందన్నారు. ఇంత అప్పు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. కనీసం రాజధాని కూడా లేదన్నారు. విజయవాడలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా? అని ప్రశ్నించారు.
ఈ పదేళ్లలో రాష్ట్రానికి కనీసం 10 పెద్ద కంపెనీలైనా వచ్చాయా? రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఉందని, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. దళితులపై దాడులు పెరిగాయని, ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియా కనపడుతోందన్నారు.
‘‘ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడంతో పాటు పన్ను రాయితీలు వస్తాయి..యువతకు ఉద్యోగాలు వస్తాయి.. దాన్ని తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా? ఉద్యమించే వాళ్లను జైలులో పెట్టారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహర దీక్షలు చేశారు.. సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ఆయన నిజమైన ఉద్యమం చేశారా? స్వలాభం కోసం ఇద్దరూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు.. రాష్ట్రానికి నేడు ప్రత్యేక హోదా కాదు కదా.. ప్యాకేజీ కూడా లేదు. ఈ పాపం జగన్, చంద్రబాబులదే’’ అని షర్మిల విమర్శించారు.
రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదు.. జగన్ మూడు రాజధానులని చెప్పి ఒక్కటీ చేయలేదు.. రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పొలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులు చాలా వరకు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఖర్చులు పదింతలు పెరిగాయని, అప్పులేని రైతు ఉన్నారా? ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ రెండూ పార్టీలు బీజేపీ చేతుల్లో ఉన్నాయని, ఆ పార్టీ ఏం చెబితే అదే చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.
ఇక షర్మిల ప్రసంగంలో మూడు ప్రధాన పార్టీలను విమర్శించింది. అన్న ప్రభుత్వంపై కూడా తీవ్రంగా విరుచుకుపడడంతో ఇక వైసీపీ శ్రేణులు కూడా షర్మిల టార్గెట్ గా విమర్శనాస్త్రాలను సంధించే అవకాశాలు ఉన్నాయి.