Sharmila Vs Avinash : అవినీష్ రెడ్డిపై పోటీగా బరిలోకి షర్మిల.. తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య కుటుంబం..

Sharmila Vs Avinash

Sharmila Vs Avinash

Sharmila Vs Avinash : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి తన బంధువు, సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది. దివంగత తండ్రి వారసత్వానికి ప్రతీకగా నిలిచిన వైఎస్సార్ కుటుంబంలో తోబుట్టువుల పోరు ఓటర్లను ఆకర్షిస్తుంది.

తన సోదరుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కడప లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం 1989 నుంచి వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఈ ఎన్నికల్లో కడపలో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు తన తల్లి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి షర్మిల తన తండ్రి వైఎస్ఆర్ సమాధిని దర్శించుకున్నారు. కడప ఎంపీ సీటులో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తన కుటుంబాన్ని చీల్చి వైఎస్సార్ అనుచరులను అయోమయానికి గురి చేస్తుందని తెలిసి ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన జీవితాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అంకితం చేశారని, అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి వారి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని షర్మిల అన్నారు.

తన తండ్రి ఆశయాలను నిలబెట్టడంలో, తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేయడంలో తనకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ మంత్రి హత్యకు గురయ్యారు. ఈ హత్యపై సీబీఐ ఐదేళ్లుగా దర్యాప్తు చేస్తోంది.

వివేకా మరణానికి కారణం గుండెపోటు అని తొలుత ప్రచారం జరిగింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కడప ఎంపీ అవినాష్ రెడ్డే హత్యకు పాల్పడినట్లు స్పష్టమైందని, జగన్ ఆయనను కాపాడేందుకు ప్రయత్నించడమే కాకుండా ఇప్పుడు కడపలో మళ్లీ పోటీ చేయించే స్థాయికి వెళ్లారని షర్మిల ఆరోపించారు.

షర్మిల ఆరోపణలు తనపై, తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమేనని అవినాష్ రెడ్డి తిప్పికొట్టారు. ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తనపై వచ్చిన ప్రతీ ఆరోపణకు వివరణ ఇస్తానని, టీడీపీ, కాంగ్రెస్ తో పాటు ప్రజల మదిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తానన్నారు.

2011లో కాంగ్రెస్ తో సంబంధాలు తెంచుకొని వైఎస్సార్ సీపీని స్థాపించిన తర్వాత వైఎస్సార్ వారసత్వాన్ని కొనసాగించింది జగన్మోహన్ రెడ్డే. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు షర్మిల ఆయనకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత 2021లో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల నేపథ్యంలో షర్మిల ఏ స్థానంలోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయ పడింది. ఆ వెంటనే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి జనవరిలో పీసీసీ చీఫ్ అయ్యింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమితో పాటు వైసీపీతో తలపడుతుంది.

TAGS