Sharmila : అందరినీ విమర్శిస్తూ.. పవన్ పేరెత్తని షర్మిల..కొత్త ట్విస్ట్ ఏమైనా..??
Sharmila : మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తూనే తన అన్న జగన్ తో పాటు చంద్రబాబును షర్మిల టార్గెట్ చేసింది. కానీ ఎక్కడా పవన్ గురించి ప్రస్తావన చేయడం లేదు. అదే సమయంలో చంద్రబాబును విమర్శించినా టీడీపీ స్పందించడం లేదు.
ఏపీలో కాంగ్రెస్ పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పింది. బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే సీఎం జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేశారు. చంద్రబాబుపైన విమర్శలు చేశారు. షర్మిల విమర్శలపై వైసీపీ నేతలు కౌంటర్ చేశారు.
సీఎం జగన్ ఉరవకొండ సభలో చెల్లి షర్మిల పేరు ప్రస్తావించకుండానే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘాలు అంటూ కామెంట్ చేశారు. దీని ద్వారా ఏపీలో తనకు వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా వ్యాఖ్యలు చేశారనే వాదన వినిపిస్తోంది.
తాజాగా విశాఖలోనూ షర్మిల మరోసారి జగన్ పై, చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. చంద్రబాబువి కనిపించే పొత్తులైతే, జగన్ వి కనిపించని పొత్తులని ఎద్దేవా చేశారు. అయితే ఎక్కడా కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ ఇటు చంద్రబాబుతో పొత్తు కొనసాగిస్తూనే అటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీకి ప్రత్యక్ష మిత్రుడిగా ఉన్న పవన్ పై షర్మిల ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం.
కాగా, జగన్ లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల రాజకీయంలో షర్మిల శైలిపైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటివరకు షర్మిల విషయంలో ఆచితూచి స్పందించిన వైసీపీ, ఇప్పుడు ఇతర పార్టీల తరహాలోనే కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ముఖ్యంగా పవన్ ను షర్మిల విమర్శించకపోవడంపైనా చర్చ సాగుతోంది.