Sharmila Contest Pulivendula : ఎన్నికలకు మరో రెండున్నర నెలల సమయం ఉండగానే ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింత హాట్ హాట్ గా మారాయి. ప్రతీ రోజూ తన అన్న జగన్ పై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనా వైఫల్యాల నుంచి కుటుంబ విభేదాల దాక ఎండగడుతుండడంతో వైసీపీ నేతలు గుక్కతిప్పుకోలేకపోతున్నారు. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల లాంటి వాళ్లు వచ్చి కౌంటర్ ఇవ్వాల్సి వస్తోంది. అయినా షర్మిల తన దూకుడు తగ్గించుకోవడం లేదు. అన్నపై ఓ రేంజ్ లో రివేంజ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఇక జగన్ కు మరో షాక్ ఇచ్చేలా షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్ నియోజకవర్గమైన పులివెందుల నుంచి తాను పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో తన మార్క్, పవర్ చూపించుకోవాలంటే ఈ నియోజకవర్గమైతేనే కరెక్ట్ అన్న ధోరణిలో ఆమె ఉన్నట్లు సమాచారం. పులివెందుల వైఎస్ అభిమానుల అండతో పాటు కుటుంబం అండ తనకే ఉంటుందనే అంచనాలో షర్మిల ఉన్నారట. కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం తేవాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ పై పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోనూ, మీడియాలోనూ తనే సెంటర్ పాయింట్ గా మారుతారని, వైసీపీ, టీడీపీలకు దీటుగా కాంగ్రెస్ ను తెరపై ఉండాలంటే తాను పులివెందుల నుంచే పోటీ చేయాలనే పట్టుదలతో ఆమె ఉన్నారని సమాచారం.
ఇదిలా ఉండగా పులివెందుల నుంచి జగన్ పై షర్మిల బరిలో ఉంటే ఓటమి తప్పదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కు ఓ సర్వే రిపోర్ట్ ఇచ్చారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చెల్లిపై పోటీ చేసి ఓడిపోవడం కంటే నియోజకవర్గం మారిస్తేనే బెటర్ అనే ఆలోచనకు జగన్ వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే జమ్మలమడుగు లేదా కమలాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈవిషయాలపై పూర్తి క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే షర్మిల మాత్రం జగన్ ను బాగానే టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్న జగన్ ను ఓడించి తన రాజకీయ భవిష్యత్ ను పకడ్బందీగా నిర్మించుకోవాలని షర్మిల భావిస్తున్నట్లు అర్థమవుతోంది.