Sharmila 3 Demands : కాంగ్రెస్ హైకమాండ్ కు షర్మిల 3 డిమాండ్లు.. అవేంటంటే..
Sharmila 3 Demands : కాంగ్రెస్ లో షర్మిల చేరికపైనే అంతటా చర్చ జరుగుతోంది. షర్మిలకు ఏ బాధ్యత అప్పగిస్తారు? అన్న జగన్ ను షర్మిల ఎలా ఢీకొట్టబోతోంది? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఇలా అనేక ప్రశ్నలు జనాల్లో తలెత్తుతున్నాయి. నిన్ననే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా షర్మిల మరో రెండు రోజుల్లో తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారో అనే దానిపై క్లారిటీ వస్తుందని ప్రకటించారు.
చేరిక అనంతరం కాంగ్రెస్ కీలక నేతలతో షర్మిల తన భవిష్యత్ పై చర్చించినట్టు తెలుస్తోంది. వైఎస్ తనయురాలిగా, యంగ్ అండ్ డైనమిక్ లేడీ లీడర్ గా, అంగ, ధన బలమున్న నేతగా షర్మిలను ఎంచుకుని ఏపీ రాజకీయాల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా ప్రస్తుత సీఎం, అన్న జగన్ పైనే ఆమెను గురిపెడుతున్నారు.
షర్మిల ఇప్పటికే తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని, అండమాన్ లో పనిచెప్పినా చేస్తానని తన విధేయత చాటుకున్నారు. ఈమేరకు షర్మిల హైకమాండ్ కు మూడు డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని, రెండోది రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వాలని, మూడోది.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అలాగే ఏపీ సారథ్య బాధ్యతలు లేదా జాతీయ పదవి కూడా ఇవ్వాలని హైకమాండ్ కు తన మనసులో మాట చెప్పింది.
షర్మిల డిమాండ్లకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవి విషయం తప్పా మిగతావన్నీ తమ చేతుల్లోవే కనుక డిమాండ్లను తీర్చే ప్రయత్నమే చేయవచ్చు. మంత్రి పదవి విషయాన్ని అధికారంలోకి వచ్చాక ఆలోచించవచ్చు అనే ధోరణిలో ఉండవచ్చు.
ఇక షర్మిల మరో నాలుగైదు రోజుల్లో ఏపీలో తన కార్యాచరణ ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు చేయబోతున్నారు. ఏపీ సమస్యల్లో ప్రధానమైన వాటిలో ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై షర్మిల తన తొలి పోరును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత అమరావతినే రాజధానిగా ఉంచాలని కూడా పోరాటం చేయబోతున్నారు. మూడో ప్రాధాన్య అంశంగా రాయలసీమ వెనకబాటుపై పాలకుల నిర్లక్ష్యంపై ఆమె ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఏపీ సమస్యలపై ఎక్కడికక్కడ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి వాటికి రాహుల్, ఖర్గే, ప్రియాంకలను ఆహ్వానించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.