Chandrababu : అడుక్కుంటే ఆస్తిలో వాటా..హైదరాబాద్ లో చోటు ఇస్తారా? ఇలాంటి సీఎం ఎక్కడైనా ఉన్నాడా?
Chandrababu : ఏపీలో ఎన్నికల వాతావరణం కాక రేపుతోంది. ఓ వైపు జగన్ సిద్ధం సభలతో బిజీ అయిపోయారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘రా కదిలిరా..’ సభలతో ప్రజల మధ్యకు వచ్చి జగన్ సర్కార్ ను ఎండగడుతూ ఉంటే, మరో పక్క యువనేత లోకేశ్ ‘శంఖారావం’ పేరిట సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగిన ‘రా..కదిలిరా’ సభలో చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని గురించి రోజుకో మాట మాట్లాడుతున్న జగన్ ప్రభుత్వం తీరుని నిశితంగా విమర్శిస్తూ..‘గత ఎన్నికలకు ముందు అమరావతి మన రాజధాని అని జగన్ అన్నాడు.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానులు అవసరం అన్నాడు.. మళ్లీ మాట మార్చి విశాఖ ఒక్కటే మన రాజధాని అంటున్నాడు.. మరో రెండు నెలల్లో కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోతూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నాడు’ అని ఎద్దేవా చేశారు.
ఇంతకీ ఏపీకి ఎన్ని రాజధానులున్నాయి? ఎక్కడ ఉన్నాయి? ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ఐదేళ్లలో ఒక్క రాజధాని ఏర్పాటు చేయలేకపోయాడన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నాడని విమర్శించారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని మనం అక్కడే ఉండిపోయి ఉంటే, ఈ అమరావతిని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయేవాళ్లం కదా? జగన్ అధికారంలోకి రాగానే అమరావతి పనులు కొనసాగించి ఉంటే నేడు ఏపీకి ఈ పరిస్థితి రాకపోయి ఉండేది. దేశంలోనే టాప్ రేంజ్ లో ఉండేదన్నారు.
కానీ జగన్ రెడ్డికి కూల్చడమే తప్ప ఏదీ నిర్మించడం చాతకాదు కనుక ఈ ఐదేళ్లు అదే పనిలో ఉండిపోయి, ఎన్నికలకు ముందు ఇప్పుడు మేల్కొని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పాట మొదలుపెట్టారని ఆరోపించారు. ఐదేళ్లలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయామని, హైదరాబాద్ లో మళ్లీ ఇంత చోటిస్తే ఓ పక్కన సర్దుకుపోతామని అడుగుతారా? అని ప్రశ్నించారు.
అడుక్కుంటే ఎవరైనా ఇంత బిచ్చం వేస్తారేమో కానీ ఆస్తిలో వాటా రాసి ఇవ్వరు కదా? అంటూ చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ తీరును విమర్శించారు. మరో రెండు నెలల్లో టీడీపీ, జనసేనల ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమరావతి రాజధాని పనులు మొదలుపెట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా ఉంటుందని, చేస్తామని ఇంత స్పష్టంగా, కచ్చితంగా చెప్పగలుగుతున్నారు.. కానీ సీఎంగా ఐదేళ్లు పాలించిన జగన్ విశాఖ పట్టణం రాజధానిగా ఉంటుందని కచ్చితంగా చెప్పలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నారు. అంటే ఒకవేళ మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చినా..ఏపీకి రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచనే లేదని తెలుస్తోందని వారు ఆరోపిస్తున్నారు.