Sharannavaratri celebrations : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
దుష్టుడైన మహిషాసురుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్ధిని రూపంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు, అష్ట ఆయుధాలు, సింహవాహినిగా, రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే, శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా ముల్లోకాలను అమ్మవారు కాపాడినట్లే, భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని, అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం మీది విజ్ఞానం, బాధల మీది విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజల పరమలక్ష్యం. ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈ రోజు అమ్మవారికి సమర్పంచే నైవేద్యం పాయసాన్నం, రవ్వతో చేసిన చక్కెర పొంగలి సమర్పిస్తారు.