JAISW News Telugu

Shantiswaroop : ‘‘వార్తలు చదువుతున్నది శాంతిస్వరూప్’’.. మీ స్వరం మరిచిపోలేని జ్ఞాపకం

Shantiswaroop : దూరదర్శన్ అనగానే ముందుగా వార్తలు గుర్తుకొస్తాయి. వార్తలు అనగానే గుర్తుకొచ్చే తొలిపేరు శాంతిస్వరూప్. శాంతిస్వరూప్ కు దూరదర్శన్ వార్తలకు తెలుగు ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉంది.  శుక్రవారం వచ్చే చిత్రలహరి, శనివారం వచ్చే హిందీ సినిమా, ఆదివారం వచ్చే తెలుగు సినిమా, రోజు రాత్రి వచ్చే వార్తలు ఎవరు మాత్రం మరిచిపోతారు. 80,90 దశకాల్లో పుట్టిన వారికి దూరదర్శన్ తో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది.

దూరదర్శన్ లో వార్తలు చదివే శాంతిస్వరూప్ కూడా అంతే. ఆయన విషాదం, వినోదం, విధ్వంసం, విచారం, విజయోత్సవం ఇలా ..ఎలాంటి వార్త అయినా ప్రసన్నవదనంతో చదవడం శాంతి స్వరూప్ గారి ప్రత్యేకత. ఆయన వాచకంలో స్పష్టత మరెవరికీ రాదేమో. తెలుగు పదాలను  చాలా అందంగా, అర్థవంతంగా పలుకడంలో ఆయన తర్వాతే ఎవరైనా. వార్తలు చదువుతున్న శాంతిస్వరూప్ అనగానే కళ్లు టీవీ స్క్రీన్ ల వైపు అప్రయత్నంగానే కళ్లు మళ్లుతాయి. అదీ ఆయన బ్రాండ్. తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఆయన ప్రసిద్ధికెక్కారు. ఏకంగా 28 ఏండ్లు దూరదర్శన్ లోనే న్యూస్ రీడర్ గా పనిచేశారు.

అప్పట్లో వార్తలు అంటే ఆకాశవాణి, దూరదర్శన్ మాత్రమే. ఇప్పటిలా వివిధ రకాల సోర్స్ లు లేవు. వింటే ఆకాశవాణి, టీవీ ఉన్నవాళ్లు దూరదర్శన్ వార్తలు అంతే. ప్రపంచంలో ఏం జరిగిందో తెలియాలంటే ఇవే ఆధారం. ఇక టీవీలో వార్తలను శాంతిస్వరూప్ చదువుతుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో శ్రద్ధగా వినేవారు. లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. అప్పట్లో టెలీప్రాంప్టర్లు ఉండేవికావు. ఆయన పేజీలు చూడకుండానే వార్తలు చదివేవారు. ఆ తర్వాత మెల్లగా టెలీ ప్రాంప్టర్ వచ్చింది. ఈ రోజుల్లో ఎన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నా, తప్పులు చదివేస్తున్నారు న్యూస్ రీడర్లు. కానీ ఆ కాలంలో ఓ వార్తను చదివి అర్థం చేసుకుని, పొల్లు పోకుండా చదవడం అంటే మాటలా?

వార్తలు చదవడమే కాదు ఎంతో మంది ప్రముఖులను ఆయన ఇంటర్య్వూ లు చేశారు. ప్రైవేట్ చానెళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాక దూరదర్శన్ కు ఆదరణ తగ్గింది. ఇలా అనడం కన్నా ప్రభుత్వాలే దూరదర్శన్ కు ప్రాధాన్యం తగ్గించాయని చెప్పొచ్చు. ఎన్ని ప్రైవేట్ చానల్స్ వచ్చినా శాంతిస్వరూప్ వార్తల కోసమే జనాలు దూరదర్శన్ చూసేవారు. ఆయన దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తర్వాత మంచి ప్యాకేజీలతో పలు టీవీ చానళ్లు ఆయన్ను ఆహ్వానించాయి. కానీ ఆయన ఒప్పుకోలేదు. తొలి తెలుగు న్యూస్ రీడర్ గా శాంతిస్వరూప్ ను తెలుగు ప్రజలు ఎన్నడూ మరిచిపోలేరు. ఆయన నేడు మరణించినా ఆయన స్వరం తెలుగు ప్రేక్షకుల చెవుల్లో ఎప్పటికీ వినపడుతూ ఉంటుంది.

Exit mobile version