JAISW News Telugu

Raghurama : అసెంబ్లీ ప్రాంగణంలో రఘురామకు అవమానం..స్పీకర్ కు లేఖ

Raghurama

Raghurama

Raghurama : ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారును అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. అక్కడున్న అధికారులపై మండిపడ్డారు. మంత్రుల కాన్వాయ్‌ మాత్రమే లోపలికి అనుమితిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతమంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ కోరాలని తన లేఖలో కోరారు రఘురామ.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు రఘురామ. స్పీకర్‌ పదవి తనదేనని చెప్పుకున్నారు. స్పీకర్‌ పదవి లేకపోతే కేబినెట్‌లోనైనా చోటు దక్కుతుందని భావించారు. కానీ, ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రఘురామను చేర్చుకోవడానికి ఏ పార్టీ ఇష్టపడలేదు. ముందుగా ఆయన బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. ఐతే రఘురామను చేర్చుకునేందుకు నిరాకరించిన బీజేపీ.. ఎంతో కాలంగా పార్టీకి విధేయుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. అంతేకాదు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కట్టబెట్టింది. ఇక చివరకు రఘురామకు టీడీపీ ఆశ్ర‌య‌మిచ్చింది. తర్వాత ఉండి టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

కాగా, అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్ తో రఘురామ కొద్దిసేపు ఏదో మాట్లాడడం చర్చకు దారితీసింది. ఎందుకంటే రఘురామకృష్ణంరాజును జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో హింసించిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎన్నో కేసులు మోపి మానసికంగా కుంగిపోయేలా చేశారు. దీన్ని సవాల్ గా తీసుకున్న రఘురామ మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. జగన్ పై రివేంజ్ తీసుకుంటామని ఆయన పదేపదే చెప్పేవారు. అయితే జగన్ తో ఏం మాట్లాడారు అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Exit mobile version