Saindhav : రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 5 సినిమాలు సందడి చేయబోతున్నాయి. ‘గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, నా సామిరంగ, సైంధవ్’ చిత్రాలు ఈసారి సంక్రాంతి బరిలో ఉన్నాయి. వీటిలో ఏవైనా రెండు సినిమాలు వెనక్కి తగ్గుతాయేమో అని అంతా అనుకున్నారు కానీ.. ఎవ్వరూ తగ్గేదే లే అనేట్లుగా ఒకరిని మించి ఒకరు ప్రమోషన్స్ మొదలెట్టారు. ‘గుంటూరు కారం’ పాటలతో, ఫొటోలతో సందడి చేస్తుంటే.. ‘సైంధవ్’ ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. మిగతా సినిమాలు కూడా సాంగ్స్, పోస్టర్స్‌తో బాగానే హడావుడి చేస్తున్నాయి. తాజాగా వెంకీ ‘సైంధవ్’ ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సంక్రాంతికి సరిపడే సినిమానే అని అనిపిస్తుంది.
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ ‘సైంధవ్’పై భారీగానే అంచనాలున్నాయి. ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను.. తన జానర్ వదిలి సరికొత్తగా ఈ చిత్రాన్ని ట్రై చేశాడు. తన థ్రిల్లర్ జానర్ వదిలి యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌తో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ జానర్ ఆయనకు ఎంత వరకు సక్సెస్‌ని ఇస్తుందనేది చూడాలి. ‘సైంధవ్’ ట్రైలర్ చూస్తుంటే.. స్టార్ హీరో వెంకీని శైలేష్ బాగానే డీల్ చేసినట్లుగా అయితే అర్థమవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు ఒక ఎత్తయితే.. ఈ ట్రైలర్ మరో ఎత్తు అనేలా ఉంది. మరీ ముఖ్యంగా ఇందులో ‘రానా నాయుడు’ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఏ విధంగా వైరల్ అయిందో.. అందులో ఉన్న కంటెంట్, డైలాగ్స్ అంతలా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ట్రైలర్‌లో కూడా కాస్త ఆ వెబ్ సిరీస్ ఛాయలు డైలాగ్స్ పరంగా కనిపించాయి. పాప వెంకీని ఇమిటేట్ చేస్తున్నట్లుగా మొదలై.. పాపతో నాన్న గొప్పతనం తెలియజేస్తూ వెంకీలోని యాక్షన్ కోణాన్ని పరిచయం చేస్తూ ట్రైలర్ నడిపించారు. పాప సడెన్‌గా పడిపోవడం, పాప బతకాలంటే రూ. 17 కోట్ల రూపాయల ఇంజక్షన్ చేయాలని డాక్టర్స్ చెప్పడంతో.. ట్రైలర్ ఎమోషనల్‌కి టర్న్ అయింది. పాపని బతికించుకోవడం కోసం వెంకీ ఏం చేశాడు? అసలు వెంకీ ఎవరు? వంటి ఆసక్తికర కోణాన్ని టచ్ చేస్తూ.. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనేలా ట్రైలర్‌ని ముగించారు.
ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీల పాత్రలు సినిమాకి హైలెట్ అవుతాయనేది కూడా ఈ ట్రైలర్‌తో అర్థమవుతోంది. మొత్తంగా అయితే.. ‘సైంధవ్’ ట్రైలర్‌లో మ్యాటర్ ఉండటమే కాదు.. వెంకీని ఇలా చూసి చాలా కాలమే అవుతుంది. అప్పుడెప్పుడో ‘గణేష్’ సినిమాలో వెంకీ ఇలా కనిపించాడు. యూనిక్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల బంధాన్ని చాలా గొప్పగా చూపించారనే విషయంతో పాటు.. ఇదే ఈ సినిమా ప్రధాన అంశం అనేది ట్రైలర్‌లో అడుగడుగునా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది వెంకీ కెరీర్‌లో మరో గొప్ప చిత్రంగా నిలబడుతుందనే విషయం మాత్రం ఈ ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. చూద్దాం.. సంక్రాంతికి ఈ సైంధవ్ ఏం చేస్తాడో..
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బేబీ సారా పాలేకర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సేన్ గుప్తా, జయప్రకాష్ వంటి వారు ఇతర పాత్రలలో నటించిన ఈ సినిమాని సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.