Serious Accusations Against TTD EO : ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక టీటీటీ ఈవోగా ధర్మారెడ్డిని నియమించారు. అసలు ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రక్షణ శాఖలో పని చేస్తున్న ధర్మారెడ్డిని డిప్యూటేషన్ పై తీసుకువచ్చిగా టీటీడీ ఈవోగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆయన గతంలో వైఎస్ హయాంలోనూ ఈయనే పని చేశారు. ఐదేళ్లుగా ఈయనే ఈవోగా ఉన్నారంటే ధర్మారెడ్డికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు.
అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత అనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశాక, ధర్మారెడ్డి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన కొనసాగింపుపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ సాగుతున్నది. అర్హత లేకున్నా ఆయనను నియమించారని వాదన సర్వత్రా వినిపిస్తున్నది. ఆయన ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ పై ఇక్కడి కి వచ్చారు. డిప్యూటేషన్ ముగిసినా జగన్ ఆయనను కొనసాగిస్తున్నారు. వైఎస్ హయాంలోనూ ధర్మారెడ్డిని టీటీడీలో నియమించారు. కానీ కొన్ని వివాదాలు తలెత్తడంతో నాడు తొలగించారు. అయితే ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు కోసం నేరుగా సీఎం జగన్ రెడ్డినే అంతా చూసుకున్నారని చెబుతుంటారు.
ఈవో ధర్మారెడ్డి టీటీడీ బోర్డులో ఉండి గతంలో జగన్ వర్గం మీడియాలో ఆరోపణలు ఎదుర్కొన్న శేఖర్ రెడ్డితో వియ్యం అందుకునే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆయన కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు టీటీడీలో ధర్మారెడ్డి కొనసాగింపు మాత్రం అధర్మమేనని టీడీపీ నేత ఆనం ఆరోపిస్తున్నారు. జగన్ రెడ్డికి లబ్ధి చేకూరుస్తున్నాడు కాబట్టే ఆయనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అయితే గతంలోనూ ఈవో ధర్మారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. అయినా ఏపీ ప్రభుత్వం ఆయననే కొనసాగించడం ఇక్కడ విమర్శలకు తావిస్తున్నది. ధర్మారెడ్డి అంటే జగన్ కు అంత ప్రేమేందుకని టీడీపీ పదే పదే ప్రశ్నిస్తున్నది. అయితే తాజాగా ఆనం చేసిన ఆరోపణలను ఈవో ధర్మారెడ్డి కొట్టిపారేశారు. అవన్నీ ఆరోపణలేనని చెప్పుకొచ్చారు.