Fire Accidents in Nampally : వరుస అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ సిటీని కలవరానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనతో ట్విన్ సిటీ ఆగమాగం అయ్యింది. ఇంత ప్రమాదం జరిగి వారం గడవక ముందే మరో ప్రమాదం జరగడంతో అందరూ కలవరానికి గురవుతున్నారు.
నాంపల్లి సమీపంలోని బజార్ ఘాట్ లో ఒక భవనం సెల్లార్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రత నాలుగో అంతస్తు వరకు పాకింది. దీంతో తొమ్మిది మంది మంటలకు కాలిపోయారు. ఇదే తరహాలో గతంలో మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్, బోయిగూడ, గోషామహల్ లో కూడా జరిగాయి. ప్రతీ సారి అధికారులు, ప్రజా ప్రతినిధులు రావడం.. పరామర్శించడం వెళ్లడం.. ఇదే తంతుగా మారిపోయింది. కానీ, శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహ జ్వాలలు పెరుగుతున్నాయి.
అయితే తాజాగా అదే ప్రాంతంలో అంటే నాంపల్లిలోనే మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏక్ మినార్ సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద నిలిచి ఉంచిన గూడ్స్ ఆటోలో మంటలు అంటుకున్నాయి. అవి కాస్తా పెరుగుతూ ఆ ప్రాంతాన్ని అలుముకున్నాయి. దీంతో అప్పమత్తమైన స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు, ఆస్తినష్టంపై అంచనాలు వేస్తున్నారు.
అధికారుల పట్టింపులేని తనంతోనే ఇలాంటి ప్రమాదాలు సంభిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. చలికాలం కూడా ఇలాంటి ఘటనలు జరగడంపై మండిపడుతున్నారు. ఈ ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Another fire mishap in #Nampally near Anees ul ghurba orphanage. #Hyderabad pic.twitter.com/1spsDtVE9I
— Mubashir.Khurram (@infomubashir) November 15, 2023