Netflix:ఓటీటీలకు ఊహించని షాక్ తగులుతోంది. గడిచిన కొద్దిరోజులుగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దీనికి కారణం సెన్సార్ షిప్ పేరుతో భారత ప్రభుత్వం విధివాధానాలను రూపొందించి అమలు చేస్తుండడమే. ఇకపై ఓటీటీ వంటి ప్రసార మాధ్యమాలలో అశ్లీలత, విశృంఖలతకు చెక్ పెట్టడమే ధ్యేయంగా సమాచారప్రసారాల మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఆ మేరకు నియమావళి ఇప్పటికే అమల్లోకి వచ్చింది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సార్ లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్న కంటెంట్ పైనా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సెన్సార్ లేని ఓటీటీ చిత్రాలను భారత్ లో ప్రసారం చేయడం ఆపివేసింది. కానీ నెట్‌ఫ్లిక్స్ ఇటీవలి వరకు భారతీయ చిత్రాల సెన్సార్ చేయని వెర్షన్‌లను ప్రసారం చేయడంలో నిమగ్నమై ఉంది. కానీ ఇకపై అది కుదరదు.
తాజాగా మారిన నియమాల ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రాల సెన్సార్ చేయని వెర్షన్ల ప్రసారాన్ని పూర్తిగా నిలిపివేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు వెళ్లే ముందు భారతీయ సినిమాలను యథాతథంగా ప్రదర్శించడం కొనసాగించిన నెట్ ఫ్లిక్స్ కు ఇక అలా చేయడం కుదరదు.
ఇంతకుముందు సెన్సార్ కట్ లేకుండా భీద్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇక మారిన రూల్స్ ప్రకారం.. భీద్ సెన్సార్ కట్‌ను విడుదల చేయనుంది. మహమ్మారి నేపథ్యంలో తెరకెక్కిన భీద్ చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాయిస్ ఓవర్లు ఉన్నాయి. అలాగే అనేక ఇతర రాజకీయ అంశాలు ఇందులో చూపించారు. అయితే CBFC ఆదేశాల మేరకు చాలా కట్స్ పడ్డాయి. సవరించిన వెర్షన్ ని ఇప్పుడు ప్రసారం చేయనుంది. అలాగే దళపతి విజయ్ నటించిన లియో సెన్సార్ చేసిన వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేస్తోంది.
నిజానికి ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లలో కట్ లేకుండా విడుదలైనప్పటికీ ఇప్పుడు సీన్ మారింది. OMG 2 శృంగార విద్య గురించిన సినిమా. పెద్దలకు A రేటింగ్ ఇచ్చిన తర్వాత కూడా నటుడు అక్షయ్ కుమార్ హిందువుల ఆరాధ్యదైవం శివుడిగా చూపించిన విధానంపై సెన్సార్ చేయాల్సి వచ్చింది. రాజకీయాలు, మతాలకు సంబంధించిన అంశాలు, ఇతర సెన్సిటివ్ కంటెంట్ సెన్సార్ షిప్ పూర్తయాకే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాల్సి ఉంటుంది. ఇకపై ఒరిజినల్ సిరీస్ లు సినిమాలు విడుదల చేయాలంటే సెన్సార్ షిప్ తప్పనిసరి.
సినిమాటోగ్రాఫ్ చట్టం మరియు IT రూల్స్- 2021 ప్రకారం.. సినిమాలను స్ట్రీమింగ్ సేవలను నియంత్రణ కేంద్రం పరిధిలోని అంశం. కానీ మారుతున్న సెన్సార్‌షిప్ పద్ధతులపై స్పందించకూడదని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించుకుంది. భారతదేశ కంటెంట్ లో చాలా విస్తృతమైన ఒరిజినల్ ఫిల్మ్‌లు టీవీ షోలు ఉన్నాయి. ఇవన్నీ సృజనాత్మక వ్యక్తీకరణకు సంబంధించినవి అని సదరు సంస్థ పేర్కొంది. తాజా విధి విధానాలతో నెట్ ఫ్లిక్స్ భవిష్యత్ క్రియేటివిటీ, సేవలపై తీవ్ర ప్రభావం పడుతుందని కూడా ఆవేదన చెందింది.