School of Politics : ఏపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రెండు, మూడు నెలల ముందే సమరం ప్రారంభమైంది. అధికారమే లక్ష్యంగా పార్టీల అధినేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం జగన్ అభ్యర్థుల మార్పులు, చేర్పులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించారు. ఇక జగన్ ను ఇంటికి పంపించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఈసారి ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారోనని ఉత్కంఠతో ఉన్నారు.
ఏపీ విజేత ఎవరో అనేదానిపై ఇప్పటికే పలు సర్వేలు వచ్చాయి. ప్రస్తుతం మరొక కీలక సర్వే సంస్థ ఓటర్ల నాడీని పట్టింది. రాష్ట్రంలో నాలుగు పార్టీల సమరం ఉన్నప్పటికీ ఆ పార్టీదే విజయమని చెప్పింది. వైసీపీ, టీడీపీ-జనసేన మధ్యనే హోరాహోరీ ఉంటుందని తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు వాటి దరిదాపుల్లో కూడా ఉండవని వెల్లడించింది.
స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల మూడ్ ను తెలుసుకుంది. వైసీపీకి సింగిల్ గా, టీడీపీ-జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో అనే అంచనాలను వెల్లడించింది. ఈ సంస్థ గతంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో తన అంచనాలను వెల్లడించింది. ప్రస్తుతం ఏపీ అంచనాలు బయటపెట్టింది. సీఎంగా జగన్ జనాల్లో ఆదరణ ఉన్నా గెలిచేది మాత్రం టీడీపీ-జనసేన కూటమేనని తేల్చిచెప్పింది. జగన్ ఇక పెట్టేబేడ సర్దుకోవడమే తరువాయి అని పేర్కొంది. గతంలో తెలంగాణలోనూ ఈ సర్వే ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. కాంగ్రెస్ కు 59-67, బీఆర్ఎస్ కు 36-44, బీజేపీకి 7-9 వస్తాయని చెప్పింది. సర్వే చెప్పినట్టుగానే కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8 సీట్లు రావడం గమనార్హం. ఈ సర్వే రిపోర్టు దాదాపు ఏపీలోనూ పునరావృతం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. సర్వే ఫలితాలను చూద్దాం..
ఈ సర్వే తన అంచనాలను ఏపీని మూడు రీజియన్లుగా విభజించి చేసింది. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాల్లో వైసీపీకి 12-16, టీడీపీ-జనసేన కూటమికి 18-22 సీట్లు వస్తాయని, ఇక కోస్తాంధ్రలో మొత్తం 85 సీట్లలో వైసీపీకి 19-24 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 58-65 స్థానాలు, రాయలసీమలో మొత్తం 55 స్థానాల్లో వైసీపీకి 36-40 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 14-18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
పై అంచనాల ప్రకారం వైసీపీకి 67-80 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 90-105 స్థానాలు గెలిచే అవకాశం ఉంటోందని వెల్లడించింది. అందరూ అనుకున్నట్టుగానే రాయలసీమలో వైసీపీ హవా..కోస్తాంధ్రలో టీడీపీ-జనసేన కూటమి హవా నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
అభ్యర్థుల మార్పులు, చేర్పులతో జగన్ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేనట్టు నివేదిక ప్రకారం కనపడుతోంది. కోస్తాంధ్రలో టీడీపీ-జనసేన పొత్తు బాగా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాయలసీమలో కూడా వైసీపీతో సమానంగా కాకపోయినా కూటమి ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలు కనపడుతున్నాయి.