Naga Chaitanya : నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారులకు సంబంధించి 2018లో జరిగిన ఓ హృదయవిదారక సంఘటనను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు, హీరో గతంలోనే వెళ్లడించారు. ఈ సినిమాకు సంబంధించి నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
గుజరాత్ నుంచి చేపల వేటకు వెళ్లే ఈ మత్స్యకారులు అనుకోకుండా పాక్ ప్రాదేశిక జలాల్లోకి ఎలా వెళ్లారో వివరించారు. ఈ నిజజీవిత అనుభవాల్లో ‘తండేల్’ కథ లోతుగా పాతుకుపోయిందని నాగ చైతన్య వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరకు పైగా పరాయిదేశంలో గడిపిన శ్రీకాకులం మత్స్యకారులు చూపిన ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. ‘వారి ప్రయాణం, పోరాటాలు, అంతిమ విజయం ఇది మా చిత్రానికి గుండెలాగా పనిచేస్తుంది’ అని పేర్కొంటూ వారి కష్టాల లోతును అర్థం చేసుకునేందుకు మత్స్యకారులను వ్యక్తిగతంగా కలిశానని నాగ చైతన్య వెల్లడించారు.
అంతేగాక, ఒక మత్స్యకారుడి రొమాంటిక్ కథ స్ఫూర్తితో నిజమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందిందని చైతన్య వెల్లడించారు. ‘తండేల్’లో చూపించిన రొమాన్స్ కేవలం కల్పితం కాదు. ప్రతికూలతల మధ్య ప్రేమ శక్తికి ఇది నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకు మూలస్తంభంగా నిలిచే ఈ రియల్ లైఫ్ కపుల్ ఆ తర్వాత ఎలా పెళ్లి చేసుకున్నారో పంచుకున్నారు. తన భర్త, తోటి మత్స్యకారుల కోసం వాదించడంలో భార్య అచంచలమైన మద్దతును ఆయన కొనియాడారు.
‘తండేల్’ గురించి
‘లవ్ స్టోరీ’ తర్వాత దర్శకుడు చందూ మొండేటితో చైతన్య చేయబోతున్న సినిమా నాగ చైతన్యతో మూడో సినిమా అయితే.. సాయిపల్లవితో రెండో చిత్రం. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, షామ్దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.