Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు కూడా అవాక్కయ్యే అంశాలు ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ హైలైట్ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు.. గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిసింది.
అయితే, ఈ సంభాషణల ఆధారంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలర్ట్ అయినట్లు విచారణలో తెలిసందని సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపీసోడ్‌లో రాజ్యసభ ఎంపీ బీఎల్ సంతోష్, తుషార్ కోసం ఢిల్లీ, కేరళకు స్పెషల్ టీం బయల్దేరి వెళ్లింది. దీనికోసం సిట్ టీం స్పెషల్ ఫ్లైట్‌ను వినియోగించింది. ఆ ఫ్లైట్ బీఆర్ఎస్ నేతకు చెందినదిగా అధికారులు గుర్తించారు. స్పెషల్ ఫ్లైట్‌ను అక్రమంగా వాడుకున్నట్టు విచారణలో తేలింది.
ప్రస్తుతం ఫ్లైట్ ఓనర్‌ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అదనపు ఎస్పీ హోదాలో విమరణ పొందాక.. ఆయనే ఎస్‌ఐబీలో ఓఎస్డీ హోదాలో పని చేశాడు. బుధవారం (ఏప్రిల్ 03) ఉదయం సదరు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు.
అయితే, ఈ విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ జరిగిన విధానాన్ని వేణుగోపాల్ వారికి వివరించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఇటీవల టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఈ విచారణలో వేణుగోపాల్ పేరు వెలుగులోకి వచ్చింది. గతేడాది చివరలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ టీంలో.. వేణుగోపాల్ సైబరాబాద్ పోలీసులకు నేతృత్వం వహించినట్లు రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు.