Selfie : సెల్ఫీ సంబురం.. చావు అంచుల వరకు వెళ్లివచ్చిన యువతి..
Selfie : సోషల్ మీడియా పెరిగిపోయినప్పటి నుంచి రీల్స్, సెల్ఫీలు సృతిమించిపోతున్నాయి. తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ చేస్తున్నారుు కొందరు. కర్ణాటకకు చెందిన ఒక యువతి సెల్ఫీ పిచ్చితో 20 గంటల పాటు నీటితో ఉన్న ఇరుకైన సందులో చిక్కుకొని ప్రాణాలతో పోరాడి ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది ఆమెను బయటకు తీసుకువచ్చారు.
బెంగళూరుకు 63 కిలో మీటర్ల దూరంలోని తుమకూరు జిల్లా మందరగిరి కొండ సమీపంలోని మైదాల సరస్సులో ఈ ఘటన జరిగింది. తుమకూరులోని సిద్దగంగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మూడో సెమిస్టర్ కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థిని ఎస్ హంస గౌడ తన స్నేహితురాలు కీర్తనతో కలిసి జైన పుణ్యక్షేత్రం మందరగిరి కొండ సమీపంలోని సుందరమైన మైదాల సరస్సు ఛానెల్‌ను ఆదివారం సందర్శించింది.
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో హంస, ఆమె స్నేహితురాలు కీర్తన సెల్ఫీలు దిగేందుకు సరస్సు వద్దకు వెళ్లారు. హంస ప్రమాదవశాత్తు జారిపడి, బలమైన ప్రవాహంతో కొట్టుకుపోయింది. కానీ గుడ్డిలో మెల్లలా ఆమె రాతి సందుల్లో చిక్కుకుంది. తన స్నేహితురాలు నీటిలో కొట్టుకుపోయిందని కీర్తన పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసింది. తొలుత అగ్నిమాపక, అత్యవసర సేవలకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం, స్థానిక పోలీసులతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుంది. వారి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, చీకటి కారణంగా రాత్రి 8.30 గంటల వరకు వెతికినా హంస కనిపించలేదు.
సోమవారం ఉదయం నుంచి వెతకగా.. మధ్యాహ్నం సమయంలో హంస మొదట జారిపడిన ప్రదేశం నుంచి 25 అడుగుల దూరంలో ఉన్న చీకటి, గుహ లాంటి పగుళ్లలో ఉందని బృందం కనుగొంది. సుమారు 8 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు ఉన్న గుహ పాక్షికంగా నీటితో నిండి ఉంది, అక్కడ హంస నడుము లోతు నీటిలో నిలబడి ఉన్నట్లు బృందం కనుగొంది. ఆమెను బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు.
ఆసుపత్రి నుంచి హంస మాట్లాడుతూ ‘నీటిలో పడిపోయిన నేను చీకటి ప్రదేశానికి చేరుకున్నాను. రాత్రంతా నీటి ప్రవాహం వింటూనే ఉన్నా.. నేను పడిన చోటుకు దగ్గరలోనే ఉన్నానని గ్రహించా. కానీ ఏదీ చూడలేకపోయాను. సహాయం కోసం కాల్ చేయలేకపోయాను. రాత్రంతా మెలుకువగానే ఉన్నాను. సాయం చేసేందుకు ఎవరైనా వస్తారని అనుకున్నా..’ అని చెప్పింది. రెస్క్యూ సిబ్బంది కేకలు వేయడంతో, హంసా తక్కువ స్వరంతో స్పందించింది. దీంతో ఆమె బతికే ఉందని నిర్ధారించింది. అనంతరం ఆమె చేతిని పట్టుకొని బయటకు తీసుకువచ్చారు.