Public Pulse : సీమ పబ్లిక్ పల్స్: డేంజర్ బెల్స్ ఎవరికంటే!!
Public Pulse : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేయడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ తో పాటు వామ పక్షాలు కలిసి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. వీటన్నింటిలో సీఎం జగన్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో రాయలసీమ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అనంతపురంలో ‘సిద్ధం’ సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నిండింది. టీడీపీ+జనసేనలో సీమలో పట్టు కోసం అనుమానాలను పెంచింది.
రాప్తాడులో రీ సౌండ్
రాప్తాడు కేంద్రంగా నిర్వహించిన ‘సిద్ధం’ సభ సక్సెస్ కావడంతో వైసీపీలో అంచనాలు పెరిగాయి. రాయసీమలోని 52 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ+బీజేపీ+జనసేన పొత్తుతో కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఇక, వైసీపీ సిద్ధం సభను టీడీపీ పట్టున్న నియోజకవర్గాల్లో నిర్వహించింది. భీమిలి, రాప్తాడు, దెందులూరు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా.. గతంలో టీడీపీకి పట్టు ఉంది. ఇక్కడ సభల ద్వారా తమ సత్తా చాటుకొనేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, రాప్తాడు సభకు జాతీయ స్థాయిలోనూ ప్రచారం దక్కడంతో వైసీపీలో జోష్ పెరిగింది.
వైసీపీలో జోష్
రాప్తాడు సిద్ధం సభకు రాయలసీమలోని 4 జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. సభకు లక్షలాదిగా తరలి వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ సభ ట్రెండింగ్ గా నిలిచింది. సభలో సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారు. తనకు బలం లేదని బాబు ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే చంద్రబాబుకు పొత్తులు ఎందుకని జగన్ ప్రశ్నించారు. బాబు తన పాలనలో చేసిన ఒక్క మంచి పనైనా చెప్పుకోవడానికి ఉందా? అని నిలదీశారు.
పబ్లిక్ మూడ్ క్లియర్
మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని జగన్ కోరారు. ఒకసారి అవకాశం ఇస్తేనే మంచి చేశామని.. మరోసారి ఇస్తే ఇంకా మంచి జరుగుతుందని తన వేలో చెప్పుకొచ్చారు. అయితే, సభకు వచ్చిన స్పందనపై టీడీపీ మద్దతు మీడియా వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధం సభ ద్వారా రాయలసీమలో జగన్ బలం చెక్కు చెదరలేదనేది స్పష్టమైందని వైసీపీ వాదన.