CM Revanth : 6న కలుద్దాం.. సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ లేఖ

CM Revanth and AP CM CBN
CM Revanth : విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా చర్చిద్దామని ఆహ్వానించారు. ఈ మేరకు చంద్రబాబుకు మంగళవారం రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
‘‘మీరు ఈ నెల ఒకటో తేదీన లేఖ రాసినందుకు కృతజ్ఞతలు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మీకు అభినందనలు. నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం ద్వారా మీరు దేశంలోనే అరుదైన నాయకుల్లో ఒకరిగా నిలిచారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు నన్ను కలవాలన్న మీ ప్రతిపాదనతో నేను ఏకీభవిస్తున్నాను.
పునర్విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి మన భేటీ ఉపయోగపడుతుంది. అవసరం కూడా. వ్యక్తిగతంగా కలవడం పరస్పర సహకారానికి బలమైన పునాది వేస్తుంది. అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించగలం’’ అని ఆ లేఖలో రేవంత్ పేర్కొన్నారు.