AP Govt : మాజీ సీఎం జగన్ కు భద్రత తగ్గించారని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. జగన్ కు ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ నిర్ధారించింది. వాహనం ఫిట్ నెస్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. జగన్ కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్ నెస్ తో ఉందని కండిషన్ చూసిన తర్వాతే వీఐపీకి కేటాయించామని అధికారులు స్పష్టం చేశారు.
సౌకర్యంగా లేదని జగన్ కారు దిగి.. వాహనం ఫిట్ గా లేదని ప్రచారం చేయడం తగదని పేర్కొంటున్నారు. జగన్ కారు దిగిన తర్వాత అదే కాన్వాయ్ లో ఆ వాహన వెళ్లిందని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం జగన్ కు భద్రత కల్పిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.