Section 144 : హైదరాబాద్‌లో 144 సెక్షన్.. ఎందుకు, ఎప్పటి వరకంటే..?
ప్రస్తుతం తెలంగాణ స్పెషల్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. వన్ స్టేట్ వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సచివాలయం ఎదుట కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. మరో 10 మందిని తొలగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దానికి తోడు జన్వాడ పార్టీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత బంధువులకు చెందిన ఫామ్‌హౌస్‌లో భారీ మొత్తంలో లభించిన విదేశీ మద్యం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కాగా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది రేవ్ పార్టీ కాదని, కుటుంబ సభ్యులతో దావత్ అని చెబుతున్నారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చే ప్రమాదం ఉండడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.