Dowleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Dowleswaram Barrage : గోదావరి ఉగ్రరూపంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద వరద నీటిమట్టం 13.75 అడుగుల వద ఉండగా 13 లక్షల 261 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం దిగువన విలీన మండలాల నుంచి కోనసీమ వరకూ పరివాహక ప్రాంతాల ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోనసీమ లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కనకాయలంక కాజ్ వే పై రాకపోకలు స్తంభించాయి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 51.30 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. గత రాత్రి నుంచి స్వల్పంగానే గోదావరి పెరుగుతున్నప్పటికీ మూడో ప్రమాద హెచ్చరిక వచ్చు స్థాయికి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే రహదారిపై నీళ్లు వచ్చాయి.
అదే విధంగా గత మూడు రోజుల నుంచి విలీన మండలాలకు వెళ్లే రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఎగువ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి వరద తీవ్రత కొంత తగ్గిందని సమాచారం. అయితే, నిన్నటి వరకు గోదావరి దిగువన ఉన్న శబరి నది భారీగా పెరిగి మళ్లీ తగ్గి గత రాత్రి నుంచి మళ్లీ పెరుగుతుంది. శబరి పెరిగితే గోదావరికి ప్రమాదకరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.