Second Bullet Train : గుజరాత్ కు త్వరలో రెండో బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. అహ్మదాబాద్ నగరం న్యూఢిల్లీని కలుపుతూ రెండో హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం రైలు సబర్మతి స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ మల్టీ మోడల్ హబ్ ను ఏర్పాటు చేశారు.
ఎలివేటెడ్ కారిడార్ లో గంటకు 250 కిలో మీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ హైస్పీడ్ రైలు అహ్మదాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య దూరాన్ని సాధారణ 12 గంటలకు బదులు కేవలం 3.5 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 900 కిలో మీటర్లు వరకు ఉంటుంది.
ప్రతిపాదిత మార్గంలో న్యూఢిల్లీకి చేరుకునే ముందు గుజరాత్, రాజస్థాన్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ ఆగుతుంది. అందులో హిమ్మత్ నగర్, ఉదయ్ పూర్, బిల్వారా, చిత్తోర్ గఢ్, అజ్మీర్, కిషన్ గఢ్, జైపూర్, రేవారీ, మనేసర్ వంటి స్టేషన్లను అధికారులు ఇప్పటికి ఎంపిక చేశారు.
హైస్పీడ్ ట్రాక్ లను ప్రస్తుతం ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ) 2020, సెప్టెంబర్ లో తుది అలైన్మెంట్ డిజైన్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.