TPCC President : టీపీసీసీ అధ్యక్షుడి గురించి సెర్చ్.. ఎవరెవరు పోటీ పడుతున్నారంటే?
TPCC President : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా, తెలంగాణలో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలను నడిపించే వ్యక్తి ఎవరనే దానిపై ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి వెతుకుతున్నారు. గతంలో ఆయన వద్ద ఆ పదవి ఉండడంతో సమర్థవంతంగా నిర్వహించి పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో పలువురి పేర్లు చక్కర్లు కొడుతుండడంతో పోటీ మరింత పెరిగింది. పలువురు ఆశావహులను పరిశీలిస్తున్నారు.
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సోదరులు జీ వివేక్, జీ వినోద్ పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెలమ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాసాగర్ రావు కూడా ఉన్నారు. దీనికితోడు నల్గొండకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండడంతో రాజా గోపాల్ కు పీసీసీ అధ్యక్ష పదవి వంటి మరో కీలక పదవి ఇస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీహరి ముదిరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం గౌడ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేస్తే మధు యాష్కీ గౌడ్, బీ మహేష్ కుమార్ గౌడ్ బరిలోకి దిగనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టడంతో టీపీసీసీ అధ్యక్ష పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్ ఢిల్లీ పర్యటన అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని, ప్రకటనకు ముందు పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.