Supreme Court : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (ఎస్సీ/ఎస్టీ) వర్గీకరణ ఆమోదయోగ్యమైనదని సుప్రీంకోర్టు గురువారం మెజారిటీతో తీర్పునిచ్చింది. ధర్మాసనం తరఫున చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఉప వర్గీకరణ ఆర్టికల్ 14ను ఉల్లంఘించదని, సబ్క్లాస్లను జాబితా నుంచి మినహాయించలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘రిజర్వేషన్ ప్రయోజనం కోసం షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణ న్యాయమైనదని మేము భావించాము’ అని పేర్కొంది.
అసలు కేసు ఏంటంటే.. వాల్మీకి, మజాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో తీర్పు నిచ్చింది.అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ వర్గీకరణ 2004లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని ‘ఈవీ చిన్నయ్య Vs ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. ఆ నిర్ణయం ప్రకారం పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టుల ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. దీనిపై కోఆర్డినేట్ ధర్మాసనం.. ఇచ్చిన నిర్ణయాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని కేసును సమీక్ష కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు.
ఫిబ్రవరిలో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు ఉందా? లేదా? ఈ అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ సమీక్షించారు. ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు విచారణ కొనసాగింది. వాదనలు ముగియగానే ఫిబ్రవరి 8న నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు… ఐదు నెలల తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, దీనివల్ల ప్రభుత్వాలు తగిన పథకాలు రూపొందించవచ్చని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఈ ఏడాది నెరవేరనుంది.